Idream media
Idream media
కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపే కుట్ర జరుగుతోందని, పార్టీని విడిచే ప్రసక్తేలేదని ఏఐసీసీ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు స్పష్టం చేశారు. తాను ఒకవేళ చనిపోతే తన దేహంపై కాంగ్రెస్ జెండానే కప్పాలని అన్నారు. సోమవారం బాగ్‌అంబర్‌పేటలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో కలిసి వీహెచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌లో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని, దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాలకు వెళ్లిన తనను పార్టీకి చెందిన కొంతమంది అనరాని మాటలతో అవమానపరిచారని ఆరోపించారు. తనతో వచ్చిన కొందరిని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
తమకు అవమానం జరిగినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ప్రేమ్‌సాగర్‌రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసు.. మామ అల్లుడికి ఉత్తరం రాసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రేమ్‌సాగర్‌రావుకు ఉదయం నోటీసు ఇచ్చి సాయంత్రం రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి ఎలా వెళ్తారని వీహెచ్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ మంచిర్యాలలో జరిగిన అవమానాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవలి కాలంలో సీనియర్లు ఈ తరహా ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లో పెరుగుతోంది.