iDreamPost
android-app
ios-app

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతి

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతి

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్‌సింగ్‌(89) కన్నుమూశారు.గత జులై 4వ తేదీ తీవ్ర అనారోగ్యంతో ఆయన లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేరారు.వైద్య నిపుణుల బృందం ఆయనని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.కానీ శనివారం రాత్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

1932 జనవరి 5న జన్మించిన కళ్యాణ్‌సింగ్‌ విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)తో సుదీర్ఘ అనుబంధం పెనవేసుకున్న నేత. 1967లో తొలిసారి ఆయన బీజేపీ ఏర్పడకముందే జనసంఘ్ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యూపీ అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేసిన ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఎమర్జెన్సీ సమయంలో 21 నెలలు జైల్లో ఉన్నారు.హిందుత్వ వాదిగా ముద్రపడిన కళ్యాణ్ సింగ్ రెండుసార్లు లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కళ్యాణ్‌సింగ్‌ ఉత్తర్ ప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.1992లో కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు.ఆ సందర్భంగా కరసేవకులపై కాల్పులు జరపవద్దని పోలీసులకు ఆదేశాలివ్వడం అప్పట్లో వివాదాస్పద అంశంగా మారింది.బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి సెప్టెంబర్ 1997 నుంచి 1999 నవంబరు వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.పాలక సంకీర్ణంలో అంతర్గత కుమ్ములాటలతో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి పీఠం నుండి వైదొలిగారు. 

2004లో మాజీ ప్రధాని వాజ్‌పేయి కోరిక మేరకు కల్యాణ్‌సింగ్‌ బీజేపీలో చేరారు.అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.మరో పర్యాయం 2009లో ఆయన బీజేపీని వీడి సాధారణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది లోక్ సభలో ప్రవేశించారు. 2010 లో ఆయన స్థాపించిన జన్‌క్రాంతి పార్టీ జనవరి 2013 లో బీజేపీలో విలీనమైంది.తర్వాత మార్చి 2014 లో తిరిగి ఆయన బీజేపీలో చేరి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.దీంతో బీజేపీ ఆయనని మరోసారి జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించింది.

2014 నుంచి 2019 వరకు కల్యాణ్‌సింగ్‌ రాజస్థాన్ గవర్నర్‌గాను పనిచేశారు.తన అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి 2019లో తిరిగి క్రియాశీలక రాజకీయాలలోకి ప్రవేశించారు.ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. బాబ్రీ విధ్వంసం కుట్ర అభియోగాల నుంచి ఆయనతో సహా 32 మంది నేతలకు 2020 సెప్టెంబరులో విముక్తి లభించింది.ప్రస్తుతం కల్యాణ్ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్ సింగ్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.