కాంగ్రెస్ పార్టీ తన అశక్తతను మరోమారు రుజువుచేసుకుంది. గ్రేటర్ వార్ లో అధికార పార్టీకి నామమాత్రపు పోటీ ఇవ్వడంలో కూడా విఫలమైంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన జాతీయ పార్టీ బల్దియాలో రెండు స్థానాలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. వరుస ఓటముల నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు ఉత్తమ్.
ఎక్కడో వెనకబెంచిలో ఉన్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో ఒక్కసారిగా దూకుడును పెంచింది. రాష్ట్రంలో అధికార పార్టీతో తలపడ సత్తా తనకుందని గ్రేటర్ ఎన్నికల్లో నిరూపించుకుంది. నాలుగు స్థానాల నుంచి నలబైకి పైగా స్థానాల్లో బీజేపీ విజయ బావుటా ఎగరేసింది. కానీ… ఒకప్పుడు మేయర్ పీఠాన్ని అధిరోహించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక ఉందని పదే పదే చెప్పే కాంగ్రెస్, ఆ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో విఫలమైంది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ పట్ల పార్టీలో మొదటి నుంచీ వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. ఆయన పార్టీని సమర్థవంతంగా నడిపించలేకపోతున్నారని పలువురు సీనియర్ నేతలు అనేక సార్లు వ్యాఖ్యానించారు.
ఉత్తమ్ నాయకత్వంలోనే 2018 ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ ముందు నిలవలేక పోయింది. చివరకు తాను గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. నకిరేకల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరారు. ఆ సందర్భంగా సొంత జిల్లాలో ఎమ్మెల్యేను కూడా ఉత్తమ్ నిలబెట్టుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నారు.
2018 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ గా గెలవటంతో ఖాళీ చేసిన హుజూర్ నగర్ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ దక్కించుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ లోక్ సభకు ఎన్నికైన తరువాత హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి మీద విజయం సాధించారు. ఫలితంగా ఉత్తమ్ సొంత నియోజక వర్గంలోనే పట్టుకోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ పార్టీని గెలుపు తీరాల వైపు నడిపించలేక పోయారు ఉత్తమ్. ఇప్పుడు గ్రేటర్ లో ఘోర వైఫల్యాన్ని కూడా ఉత్తమ్ తన ఖాతాలో వేసుకున్నారు.
రాష్ట్ర రాజకీయాలు హీటెక్కిన వేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వరుస వైఫల్యాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి కి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఢీ కొట్టే నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి పోటీ పడుతున్నప్పటికీ ఆ పదవిని రేవంత్ కి అప్పగించడం వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ మార్పుకు సిద్ధమైన కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగానే ఫలితాలు వెలువడే వరకూ ప్రకటించలేదని తెలుస్తోంది. ఓటమికి ముందే పీసీపీ చీఫ్ ని మార్చితే ఆ వైఫల్యాలకు కొత్త సారథి బాధ్యత వహించాల్సి కనుక పీసీసీ చీఫ్ మార్పు ప్రక్రియను వాయిదా వేశారు. రేపో మాపో అధిష్టానం కొత్త సారథిని ప్రకటించడానికి ముందే ఉత్తమ్ కుమార్ తప్పుకోవాలనున్నారు. త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా ఓటమి తప్పదనే భయం కాంగ్రెస్ లో ఇప్పటినుంచే మొదలైంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందే తప్పుకోవడం ద్వారా తన ఖాతాలో మరో అపజయం చేరదనే భావనతోనే ఉత్తమ్ ముందుగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కానీ… ఉత్తమ్ రాజీనామాకు ముందే హైకమాండ్ పీసీసీ పగ్గాలు రేవంత్ చేతిలో పెట్టాలని నిర్ణయించుకుంది. మరి ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్ అయినా కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడతారో లేదో చూడాలి.