iDreamPost
android-app
ios-app

ఉత్త‌రాఖండ్ బీజేపీ ముఖ్య‌మంత్రి తీరత్‌ సింగ్ రాజీనామా

ఉత్త‌రాఖండ్ బీజేపీ ముఖ్య‌మంత్రి తీరత్‌ సింగ్ రాజీనామా

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రాజీనామా చేశారు. శుక్ర‌వారం ఉద‌యం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో స‌మావేశ‌మైన ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. త‌న రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ బేబిరాణి మౌర్య‌కు అంద‌జేశారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల్ల ముందే ఆయ‌న రాజీనామా చేశారు.

కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొదటి విద్యా శాఖ మంత్రిగా తీర‌త్ సింగ్ ప‌ని చేశారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2013లో ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలోనే రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాడు. ఆ తర్వాత 2019 మే 23న ఘర్వాల్ నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా నేపథ్యంలో 2021 మార్చి 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీర‌త్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే, అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం… ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుంది. రాష్ట్రంలో రెండు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. క‌రోనా త‌దిత‌ర కార‌ణాల‌తో అప్ప‌ట్లోగా అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి లేన‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి తోడు త్వ‌ర‌లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అంత‌కు ముందే ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు సొంత పార్టీలో కూడా ఆయ‌న‌కు కొంత వ్య‌తిరేక‌త ఉంది. ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న‌తో రాజీనామా చేయించ‌డం ద్వారా పార్టీలోని అస‌మ్మ‌తి కూడా స‌ద్దుమ‌ణ‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని కూడా పార్టీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఆరు నెల‌ల గడువు ముగిసేలోగా ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి లేనందున‌, అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ప‌ద‌విలో కొన‌సాగితే రాజ్యాంగపరమైన ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి… ఇలా ప‌లు కార‌ణాల నేప‌థ్యంలో తీర‌త్ సింగ్ మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి బీజేపీ అధిష్టానం పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతూనే ఉన్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో బుధవారం రాత్రి భేటీ అయిన ఆయన.. శుక్రవారం మరోసారి నడ్డాను కలిశారు. ఈ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా… హల్ద్వానీ, గంగోత్రి శాసన సభ స్థానాలు ఖాళీగానే ఉన్నప్పటికీ, ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే దాఖలాలు కనిపించడం లేనందున ఇదే సరైన నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. దీంతో తీరత్‌ సింగ్‌ రాజీనామా చేశారు. తీరత్‌ సింగ్‌ ప్రస్తుతం పౌరీ గర్వాల్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంలో మరో కీలక నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.