Idream media
Idream media
పూసపాటి అశోక్ గజపతి రాజు బహుశా తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ ఎదుర్కొని ఉండరు. రాజవంశానికి చెందిన ఆయన చుట్టూ ఇప్పుడు ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రభుత్వం అశోక్ గజపతికి షాక్ ల మీదు షాక్ లు ఇస్తున్నాయి. తాజాగా మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో వివాదం మరో మలుపు తిరగనుంది.
దీనికి తోడు.. ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితతో న్యాయపోరాటంలో విజయం సాధించి.. మాన్సాస్ అధ్యక్షుడిగా మళ్లీ బాధ్యతలు చేపట్టినప్పటికీ అశోక్ గజపతిరాజుకు ఊర్మిళ గజపతిరాజు రూపంలో మరో పోరాటం ఎదురైంది.
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారానికి వస్తే మహారాజా అలక నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1958 నవంబర్ 12న ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ను విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చిట్ట చివరి క్రౌన్ ప్రిన్స్ అయిన పూసపాటి విజయరామ గజపతి రాజు తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. విద్యా, సంస్కృతి , సంగీతం వంటి వాటికి ప్రాధాన్యత నిస్తూ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలను నిర్వర్తించడానికి నిర్ణయించారు. ఇక మాన్సాస్ ట్రస్టును నిర్వహించడం కోసం ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 50 వేల కోట్ల రూపాయల విలువైన 14,800 ఎకరాల భూమిని ట్రస్టు నియంత్రణలో ఉంచారు. ట్రస్టు కార్యకలాపాల్లో అక్రమాలు జరిగినట్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగులోకి వచ్చింది.
ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాలలోని 108 ఆలయాలు, వాటి భూములు కూడా మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాన్సాస్ ట్రస్ట్ భూములలో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ రగడ ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజును తొలగించింది. న్యాయ పోరాటం చేసి తిరిగి తన ట్రస్ట్ చైర్మన్ ను సంపాదించినప్పటికీ అశోక్ గజపతి రాజు ను వివాదాలు వెంటాడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా అశోక్ గజపతి రాజుకు ఒకప్పుడు ఉత్తరాంధ్రలో తిరుగుండేది కాదు. ఇప్పుడాయన వంశపారంపర్యంగా వస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గిరీ కోసమే పోరాడాల్సి వస్తోంది. ఇప్పుడు తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత కాకుంటే నేనే అంటూ తాజాగా ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించి రంగంలోకి దిగారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ వ్యవహారంలో రోజుకో దుమారం ఏపీలోని అధికార వైసీపీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తొలగించి, ఆ స్థానంలో సంచయిత గజపతి రాజుకు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా పట్టం కట్టారు. అయితే ఆతర్వాత హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు కోర్టు తీర్పుతో మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కోర్టును ఆశ్రయించి న్యాయబద్ధంగా తన ట్రస్ట్ చైర్మన్ పదవిని దక్కించుకున్నా అశోక్ గజపతి రాజుకు మాత్రం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించడం దినదినగండంగా మారుతోంది. చివరకు ఉద్యోగుల జీతాల విషయంలో కూడా రచ్చ జరిగింది.
మాన్సాస్ ట్రస్ట్ లో టీడీపీ హయాంలో అక్రమంగా భూముల విక్రయాలు జరిపారని, చంద్రబాబు అశోక్ గజపతి రాజు కలిసి మాన్సాస్ భూముల వ్యవహారంలో జీవో తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా భూములను విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. మాన్సాస్ ట్రస్ట్ లో ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్ కూడా సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత జీతాల విషయంలో ఈవోకు ఉద్యోగులకు మధ్య చోటుచేసుకున్న వివాదం కూడా చిలికి చిలికి గాలివానగా మారింది. మాన్సాస్ ట్రస్ట్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదని ఈ వ్యవహారానికి సంబంధించి అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ పేర్కొనడం మరో వివాదానికి కారణమైంది.
ఈ వివాదాలు ఇలా ఉండగానే.. మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి తనను నియమించాలని కోరుతూ ఆనందగజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తనను, సంచయితను మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి వారసులుగా గుర్తించిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. సంచయితకు కాకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కోర్టులో ఊర్మిళ పిటీషన్ విచారణ సంచయిత ట్రస్ట్ చైర్మన్ కానిపక్షంలో తనకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో అశోక్ గజపతి రాజుకు మళ్లీ తలనొప్పి మొదలైంది.
ఈ కేసుల గోల ఒకవైపు అయితే, మరోవైపు ప్రభుత్వం కూడా అశోక్ గజపతికి షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ ఆదేశిస్తూ నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది. ఇప్పటికే సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో.. భారీగా భూములు తొలగించినట్లు గుర్తించారు. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక అందించింది. ఈ క్రమంలో ట్రస్టు వ్యవహారం, అశోక్ గజపతి రాజు పాత్రలో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.