Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో అసంతృప్తి జ్వాలలు భోగిమంటల వలె ఎగిసి పడుతున్నాయి. రెండు రోజుల క్రితం యూపీ బీజేపీలో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల వేళ ఓబీసీ ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం కమలనాథులను కలవర పెడుతోంది. తాజాగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఎమ్మెల్యే ముఖేష్ వర్మ కషాయానికి గుడ్ బై చెప్పిన గంటల వ్యవధిలోనే స్వతంత్ర మంత్రి ధరమ్‌సింగ్ సైనీ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఓబీసీల్లో మంచి పట్టున్న ధరమ్ సింగ్ సైనీ నాలుగుసార్లు షహారన్‌పూర్ జిల్లా నకుద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీ ప్రాథమిక సభ్వత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. దీంతో యోగి క్యాబినెట్‌కు రాజీనామా నుంచి మంత్రుల సంఖ్య మూడుకు చేరగా,బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఎస్పీలో ఉన్న ధరమ్ సింగ్, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో కలిసి బీజేపీలో చేరారు.2017 ఎన్నికల్లో బీజేపీకి వెన్నుదన్నుగా ఓబీసీలు నిలవడంతో ఏకపక్ష విజయం సాధించింది. కానీ సీఎం యోగి ఐదేళ్ల పాలనలో వ్యవహరించిన తీరుపై ఓబీసీ వర్గాలలో అసంతృప్తి నెలకొంది. దీనిని క్షేత్రస్థాయిలో గమనించిన ఓబీసీ నేతలు కషాయానికి దూరమవుతున్నట్లు అర్థమౌతోంది. కాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య తన భవిష్యత్తు కార్యాచరణను శుక్రవారం వెల్లడిస్తానని తెలిపారు. వీరందరూ జనవరి 14న సమాజ్‌వాదీ సైకిల్ ఎక్కే అవకాశం ఉంది.
బీజేపీలో ముసలం పుట్టిస్తున్న స్వామి ప్రసాద్ మౌర్య
కొంత కాలంగా సీఎం యోగిపై అసంతృప్తితో ఉన్న కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అదును చూసి బీజేపీ సర్కార్‌ను దెబ్బ కొడుతున్నారు. బీజేపీలోని ఓబీసీ ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రసాద్ మౌర్య ఆద్యం పోస్తున్నారు. యోగి ప్రభుత్వం వెనుబడిన వర్గాలు, దళితులపై వివక్ష చూపిస్తోందని, ప్రజా ప్రతినిధులను అగౌరవపర్చిందని ఆయన వర్గం బీజేపీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాషాయ శిబిరం అసమ్మతివాదులు, తిరుగుబాటు నేతలను బుజ్జగించే బాధ్యతను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అప్పగించింది.
ఓబీసీ వర్గాల్లో పట్టున్న స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ వంటి బలమైన నేతలు బీజేపీకి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. నిన్న మంత్రి పదవికి రాజీనామా చేసిన దారాసింగ్ బీఎస్పీ తరఫున రాజకీయాల్లో ప్రవేశించి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీలోని మౌ ప్రాంతంలో దారాసింగ్ బలమైన ఓబీసీ నేతగా ఎదిగారు. 2017 ఎన్నికల ముందు మరో ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యతో కలిసి కమలం గూటికి చేరారు.వీరిద్దరూ కనీసం 25 నియోజకవర్గాల్లో బీజేపీ విజయావకాశాలకు గండికొట్టే అవకాశముంది. యూపీలో తిరిగి అధికార పీఠం తమదేనని ధీమాతో ఉన్న బీజేపీకి తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. వీరి బాటలోనే మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నడిచి త్వరలో ఎస్పీలోకి జంప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లూ అధికార బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా బయటపడటంతో కమలనాథులకు కంటి మీద కునుకు కరువైంది.