Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2022లో జరిగే జనరల్ ఎలక్షన్‌లలో తమ పార్టీ కాంగ్రెస్,బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)లతో పొత్తు పెట్టుకోదని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వలస కార్మికులు తదుపరి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారని ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా తమ పార్టీ చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చని తెలిపారు. ఏ పెద్ద రాజకీయ పార్టీతోనూ ఎన్నికల ఒప్పందం చేసుకోకూడదని తమ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చిన వలసదారులు ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ కోసం ఏమి చేయటం లేదని వారు భావిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు. సొంత రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికులకు ఆహారం మరియు ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టకుండా ఫేస్ మాస్కులు,శానిటైజర్‌లను యోగి ప్రభుత్వం అందజేస్తుందని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయాలు బహుళ పోటీగా మారాయని, ఆమె రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం కొనసాగించాలని ఎస్పీ అధ్యక్షుడు ఆకాంక్షించారు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్‌తో కలిసి బిజెపిని ఎదుర్కొంది. అయితే ఆ ఎన్నికలలో ఆశించిన ఫలితాలను ఎస్పీ-కాంగ్రెస్ కూటమి సాధించలేదు.దీనితో ఇరు పార్టీలు విడిపోయి ప్రజా సమస్యలపై ఒంటరిగా తమ రాజకీయ పోరాటాన్ని చేపట్టాయి. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి, అజిత్ సింగ్ యొక్క రాష్ట్ర లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తో పొత్తు పెట్టుకొని మహాఘట్‌బంద్ ను ఏర్పాటు చేసింది.అందులో భాగంగా సమాజ్ వాది పార్టీ రాష్ట్రంలోని 80 పార్లమెంట్ సీట్లలో 37 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టింది.ఇక బిఎస్పీ 38 స్థానాలలో పోటీచేయగా, ఆర్‌ఎల్‌డి మూడు సీట్ల నుంచి బరిలోకి దిగింది. కాగా అమేథి,రాయ్ బరేలి రెండు సీట్లు కాంగ్రెస్‌కు కూటమి వదిలిపెట్టింది.
అయితే పార్లమెంట్ ఎన్నికలలో ఎస్పీ కేవలం ఐదు సీట్లు మాత్రమే సాధించగా,బిఎస్పి 10 సీట్లు గెలుపొందింది. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ రాయ్ బరేలి నుండి గెలవగా,అమేథిలో రాహుల్ గాంధీని బిజెపి నాయకురాలు,కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాయావతి మహాఘట్‌బంద్ పేలవమైన ప్రదర్శనకు సమాజ్ వాది పార్టీని నిందిస్తూ కూటమి నుండి వైదొలిగారు. ఆ సందర్భంలోను పొత్తుల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.కానీ సుమారు ఒకటిన్నర సంవత్సరం పైగా ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో పొత్తుల గురించి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడటం యూపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.