iDreamPost
android-app
ios-app

లక్ష్యంలో వ్యత్యాసం ఉంది.. ఫలితం ఎలా ఉండబోతోంది..?

లక్ష్యంలో వ్యత్యాసం ఉంది.. ఫలితం ఎలా ఉండబోతోంది..?

రాజకీయాలు మారిపోయాయి. అంగబలం, అర్థబలం ఉన్న వారికే అసెంబ్లీ, లోక్‌సభ టిక్కెట్లు అనే విధానాలకు కొన్ని రాజకీయపార్టీలు స్వస్తి పలుకుతున్నాయి. మంచి లక్ష్యంతో సామాన్యులను చట్టసభలకు పంపిచాలనుకునే పార్టీలు.. ఆ క్రమంలో విజయం సాధిస్తున్నాయి. ఈ విధానాన్ని ఎన్నికల స్టంట్‌గా వినియోగిస్తున్న పార్టీలకు మాత్రం ఆశాభంగం తప్పడం లేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ.. లోక్‌సభ అభ్యర్థులు సామాన్యులైన నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, గొడ్డేటి మాధవి.. వంటి వారికి టిక్కెట్లు ఇచ్చింది. వారికి ప్రజా ఆశీర్వాదం దక్కింది.

గత ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో.. అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా సామాన్యులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చింది. పని మనిషి కవితా మాంజీ, మరో ఉపాధి కూలీకి టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అప్పట్లో తీవ్ర చర్చనే సాగింది. సామాన్యులకు టిక్కెట్లు కేటాయించడం మంచిపరిణామమే అయినా.. బీజేపీకి మాత్రం ఆశించిన పేరు రాలేదు. ధనికుల పార్టీ అని ముద్ర పడిన బీజేపీ.. సామాన్యులకు టిక్కెట్లు ఇవ్వడం పబ్లిసిటీ స్టంట్‌లో భాగమనే విమర్శలు వచ్చాయి. కవితా మాంజీ కూడా ఓడిపోయారు.

ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కూడా సామాన్యులు, ఉద్యమకారులు, వివిధ ఘటనల్లో బాధితులకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించింది. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు ఉన్నావ్‌ టిక్కెట్‌ ఇచ్చింది. ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన సదాఫ్ జాఫర్‌కు లక్నో సెంట్రల్ టికెట్ ఇచ్చారు. సోన్‌భద్ర ఊచకోత ఘటనకు వ్యతిరేకంగా గళం విప్పి ఉద్యమించిన మహిళకు ఉమ్భా నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక ఆశావర్కర్‌గా పని చేస్తూ గౌరవ వేతనాల పెంపు కోసం పోరాడిన పూనమ్ పాండేకు షాజహాన్ పూర్ టికెట్ కేటాయించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు రామ్ రాజ్ గోండ్‌ను రాష్ట్రంలోని పొంగ స్థానం నుండి బరిలోకి దింపారు.

కారణాలు ఏమైనా కాంగ్రెస్‌ సరైన మార్గాన్ని ఎంచుకుంది. ప్రజల నుంచి వచ్చిన వారికి, ప్రజా సమస్యలపై పోరాడిన వారికి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. చట్టసభలకు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వారే వెళ్లాలి. అప్పుడే సరైన చట్టాలు వస్తాయి. ప్రజా సమస్యలపై చట్టసభల్లో చర్చలు జరుగుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ తాజా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. సమాజ్‌వాదీ పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఆ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. కాంగ్రెస్‌కు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వేచి చూడాలి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేసిన ప్రయోగం విఫలమైంది. మరి ఉత్తరప్రదేశ్‌లో హస్తం పార్టీ మంచి ఫలితాలను అందుకుంటుందా..? వేచి చూడాలి.