iDreamPost
android-app
ios-app

యూపీ ఎన్నికలు ,అఖిలేష్ కాంగ్రెస్ పరస్పర సహకారం

యూపీ ఎన్నికలు ,అఖిలేష్ కాంగ్రెస్ పరస్పర సహకారం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీని ఎట్ల‌యినా గ‌ద్దె దించాల‌ని విప‌క్షాలు.. మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డంతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా ఓడించాల‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకున్నాయి. ఇప్ప‌టికే అఖిలేష్ యాద‌వ్ పై యూపీలో బ‌ల‌మైన నేత‌గా పేరున్న కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ను బీజేపీ బ‌రిలోకి దింపింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎవ‌రిని నిల‌బెడుతుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. ఆ పార్టీ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న క‌ర్హాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాము అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ తాజాగా వెల్ల‌డించారు.

యూపీ బాధ్య‌త‌లు చూస్తున్న ప్రియాంకా గాంధీ గ‌తంలో మాట్లాడుతూ ఎన్నిక‌ల అనంత‌రం హంగ్ ఏర్ప‌డితే తాము సమాజ్‌వాదీ పార్టీ కి మ‌ద్దతు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా అఖిలేష్ యాద‌వ్ పై పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో అంత‌ర్గ‌తంగా ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఉందా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. అయితే ఎందుకు పోటీ చేయ‌డం లేద‌నే దానిపై స‌చిన్ వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. అఖిలేష్‌పై అభ్యర్థిని ప్రకటించకపోవడానికి గల కారణాన్ని ఆయన చెప్పుకొచ్చారు. రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎస్పీ ఎవరినీ బరిలోకి దించలేదని అందుకే తాము అఖిలేష్ తో పాటు ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌పై కూడా తమ అభ్యర్థులను దింపడం లేదని ప్రకటించారు. ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అయిన శివపాల్ సింగ్ యాదవ్ జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

కాంగ్రెస్ తాజా ప్ర‌క‌ట‌న‌తో క‌ర్హాల్, జ‌శ్వంత్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌రు. 2004, 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎస్పీ అభ్యర్థుల్ని నిలబెట్టలేదని, అందుకే తాము కూడా ఎస్పీ అధినేతపై అభ్యర్థిని నిలబెట్టబోమని పైలట్ వివరించారు. ఇదిలా ఉండ‌గా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు రెండేళ్లుగా ప్రియాంకా గాంధీ అక్క‌డే మ‌కాం వేసి వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. అయితే అక్క‌డ బీజేపీ, ఎస్పీ మ‌ధ్యే తీవ్ర‌మైన పోటీ ఉంటుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన ఆజంగఢ్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1993 నుంచి కర్హాల్ నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వ‌స్తున్నారు. 2002లో మాత్రం ఎస్పీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం కర్హాల్ నుంచి ఎస్పీ నేత సోబరన్ సింగ్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ నెల ప‌దిన మొద‌టి ద‌శ అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఇక్క‌డ ఏడు దశల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. గెలుపెవ‌ర‌ది అనేది మార్చి 10న తేల‌నుంది.