iDreamPost
android-app
ios-app

యూపీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తుతున్న పాకిస్తాన్,జిన్నా పేర్లు

యూపీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తుతున్న పాకిస్తాన్,జిన్నా పేర్లు

ఉత్తరప్రదేశ్‌ పీఠం కోసం పొలిటికల్‌ పార్టీలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ బీజేపీని ఢీకొట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ గట్టిగానే పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అవకాశం దక్కినా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీపై విరుచుకు పడుతున్నారు. తనను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎస్పీని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

తాజాగా యోగి ఆదిత్యనాథ్‌ సమాజ్‌వాదీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్పీ నేతలు పాకిస్తాన్‌ ను ఇష్టపడతారని, మహ్మద్‌ అలీ జిన్నాను పూజిస్తారని అర్థం వచ్చేలా శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ‘‘వాళ్లు జిన్నాను పూజిస్తారు. మనం సర్దార్‌ పటేల్‌ను ఆరాధిస్తాం. వారికి పాక్‌ అంటే ఇష్టం, మనకు భారతమాత అంటే ప్రాణం. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రామభక్తులపై కాల్పులు జరిగాయి. మనం అధికారంలో ఉండగా రామమందిర కల సాకారమైంది’’ అని యోగి ట్వీట్‌ చేశారు. కాగా, శాంతి భద్రతలు, అభివృద్ధి అంశాలపై నోరు విప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా శుక్రవారం అఖిలేశ్‌కు సవాలు విసిరారు.

ఇదిలాఉండగా.. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు అఖిలేశ్‌ శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరగా, హెలికాఫ్టర్‌ టేకాఫ్‌కు అధికారులు అనుమతినివ్వలేదు. దీనిపై ట్వీట్‌ చేసిన అఖిలేశ్‌.. ముజఫర్‌నగర్‌ వెళ్లనీకుండా తన హెలికాఫ్టర్‌ను ఢిల్లీలో అడ్డుకున్నారని, అదే సమయంలో ఓ బీజేపీ నేత ప్రయాణానికి మాత్రం ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోనున్న బీజేపీ చేసిన ఈ కుట్రని, ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే, కాసేపటి తర్వాత హెలికాఫ్టర్‌ ఎక్కేందుకు సిద్ధమైన అఖిలేశ్‌.. విజయాన్ని అందించే విమానం ఎక్కేందుకు వెళుతున్నామంటూ మరో ట్వీట్‌ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం జన బలాన్ని కోల్పోవడానికి నిదర్శనమంటూ బీజేపీకి చురకలంటించారు.

కాగా, బీజేపీ కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ముజుఫర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బీజేపీపై ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. అయితే, ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, ఎస్పీలు కుల, మత, జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) ప్రెసిడెంట్‌ మాయావతి ఓ ట్వీట్‌ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ఒకటి.. రెండు శాతం ఓట్లతో ఫలితం తారుమారేనా?