Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి పోరుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ తొలి దశను గురువారం నిర్వహించనుంది. పశ్చిమ యూపీలోని పదకొండు జిల్లాలు, ప్రబుద్ధ్ నగర్ (షామ్‌లి), మీరట్, హాపూర్ (పంచ్‌శీల్ నగర్), ముజఫర్‌నగర్, బాఘ్‌పట్, ఘజియాబాద్, బులంద్‌శహర్, ఆలీగఢ్, ఆగ్రా, గౌతమ్‌బుద్ధ్ నగర్, మథుర జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ జాట్-ముస్లిం ప్రాబల్య ప్రాంతం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం జోరుగా సాగింది ఈ ప్రాంతంలోనే. ఈ నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. రైతుల్లో అత్యధికులు జాట్లే. సాగుచట్టాలు రద్దుచేసి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా వారిని బుజ్జగించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించగా.. వారిని ఆకట్టుకునేందుకు కేసుల ఎత్తివేత, బకాయిల చెల్లింపు వంటి చర్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్ చేపట్టారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ.. జాట్‌లలో బాగా పలుకుబడి ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)తో జట్టుకట్టి.. రైతులతో పాటు ముస్లింలకు చేరువయ్యేందుకు కృషిచేస్తోంది.
ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌధురి.. మాజీ ప్రధాని చౌధురి చరణ్‌సింగ్ మనవడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్ కుమారుడన్న సంగతి తెలిసిందే. ఈ కుటుంబం రైతులతో మమేకమై ఉండడం, లఖీంపూర్ ఖేరీలో రైతులపై పోలీసు కాల్పులతో ఆ వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో.. ఈ పరిస్థితి తమకు సానుకూలమవుతుందని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. బీఎస్‌పీ, ఎంఐఎం, కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నాయి.
పశ్చిమ యూపీలో అధిక స్థానాలు గెలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికారం చేపడతాయన్న సెంటిమెంట్‌తో.. దాదాపు అన్ని పార్టీలూ తమ తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాయి. బీజేపీ తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యోగి ఆదిత్యనాథ్, ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ అధినేతలతో పాటు బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా తదితర అతిరథ, మహారథులు ప్రచారం చేపట్టారు. బహుముఖ పోటీ అనివార్యంగా మారడం, కోవిడ్ కారణంగా సభలు, సమావేశాలపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో దాదాపు పార్టీలన్నీ ఇంటింటి ప్రచారం తలపెట్టాయి.
వీటిపై అందరి దృష్టి
తొలి విడత పోలింగ్ జరిగే 58 స్థానాల్లో ఏడు కీలక సీట్లు నోయిడా, ముజఫర్‌నగర్, బాఘ్‌పట్, మథుర, అత్రౌలి, కైరానా, థానా భవన్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. నోయిడాలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంకజ్‌సింగ్ బరిలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక్కడ ఆయనపై సునీల్ చౌధురి (ఎస్‌పీ), పంఖూరీ పాఠక్ (కాంగ్రెస్), పంకజ్ ఆవానా (ఆప్) పోటీచేస్తున్నారు. ముజఫర్‌నగర్ సీటు బీజేపీకి, ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీకి ప్రతిష్టాత్మకంగా మారింది. 2013లో ఇక్కడ జరిగిన అల్లర్ల తాలూకు భావోద్వేగాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కపిల్‌దేవ్ అగర్వాల్ మరోసారి బరిలో నిలువగా.. ఎస్‌పీ కూటమి తరఫున సౌరభ్, కాంగ్రెస్ అభ్యర్థిగా సుబోధ్ శర్మ పోటీచేస్తున్నారు. బాఘ్‌పట్‌లో ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి తరపున అహ్మద్ హమీద్ బరిలో ఉన్నారు. ఇక్కడ సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ ధర్మ తిరిగి పోటీచేస్తున్నారు.
మథురలో విద్యుత్ మంత్రి శ్రీకాంత్ శర్మ తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై ఎస్‌పీ నేత దేవేంద్ర అగర్వాల్, కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర మాథుర్ పోటీచేస్తున్నారు. అత్రౌలి స్థానంలో మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ మనవడు, రాష్ట్ర మంత్రి సందీప్‌సింగ్ తిరిగి బరిలో నిలిచారు. ఆయన్ను వీరేశ్ యాదవ్ (ఎస్‌పీ), ధర్మేంద్ర లోధీ (కాంగ్రెస్) ఎదుర్కొంటున్నారు. కైరానా నియోజకవర్గం నుంచి ఎస్‌పీ సిటింగ్ ఎమ్మెల్యే నహీద్ హసన్‌పై బీజేపీ సీనియర్ నేత హుకుంసింగ్ కుమార్తె మృగాంకా సింగ్ బరిలోకి దిగారు. హసన్ సోదరి ఇఖ్రా చౌధురి కూడా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. థానాభవన్ సీటు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. చక్కెర మంత్రి, ఫైర్‌బ్రాండ్ నేత సురేశ్ రాణా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో రైతులకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఏడాదికిపైగా ఉద్యమం నడచింది. రాణా తిరిగి పోటీచేస్తుండగా.. ఆయనపై ఆష్రాఫ్ అలీ (ఆర్‌ఎల్‌డీ), సత్య సయ్యం సైనీ (కాంగ్రెస్) బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.