iDreamPost
android-app
ios-app

యోగీకి బీజేపీ అగ్రనేతలకు అదే వ్యత్యాసం..!

యోగీకి బీజేపీ అగ్రనేతలకు అదే వ్యత్యాసం..!

ఉత్తరప్రదేశ్‌లోని 403 స్థానాలకు ఏడుదశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 10వ తేదీన తొలిదశ పోలింగ్‌ జరగబోతోంది. అన్ని రాజకీయ పార్టీలు వర్చువల్‌ సమావేశాలు, డిజిటల్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న ప్రచారం.. రెండు రకాలుగా సాగుతోంది. బీజేపీ అగ్రనేతలు పాత పంథాలో వెళుతుండగా.. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ భిన్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. యోగీ చేస్తున్న ప్రచారం.. భారతీయ జనతాపార్టీ (బీజేపీ) తీరుకు భిన్నంగా సాగుతుండడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకమైన అంశం. లోక్‌సభ ఎన్నికలైనా, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలైనా.. బీజేపీ నేతలు జాతీయ వాదం, కశ్మీర్, ఉగ్రవాదం, పాకిస్తాన్, చైనా.. అంశాలను ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు. ఇందుకు భిన్నంగా యోగీ ఆదిత్యనాథ్‌ తన పాలన గురించి చెబుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ఆరు నెలల ముందే.. ప్రచారం ప్రారంభించిన యోగీ.. తన పాలనలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి, తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల ముందు పెట్టారు. కరపత్రం రూపంలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు చేర్చారు. శాంతి భదత్రలు, ఆర్థిక అభివృద్ధి అంశాలను యోగీ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ అంటే.. మాఫియాలకు అడ్డాగా ఉండేదని, తాను వచ్చిన తర్వాత మాఫియాపై ఉక్కుపాదం మోపానని చెబుతున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, ఫలితంగా పెట్టుబడులు వచ్చాయని ప్రచారంలో వివరిస్తున్నారు. తన ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలబడిందని చెబుతున్నారు. ప్రజల తరసరి ఆదాయం తొలిసారి 47 వేల నుంచి 54 వేల రూపాయలకు పెరిగిందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రెండు లక్షల కోట్ల రూపాయల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలకు పెంచామని యోగీ తన ఎన్నికల ప్రచారంలో చెబుతూ ప్రజలమద్ధతు కోరుతున్నారు.

అదే ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీ, బీజేపీ కీలక నేత, హోం మంత్రి అమిత్‌షా, ఇతర అగ్రనేతలు.. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధంలేని అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్, మహ్మద్‌ అలీ జిన్నాల ప్రస్తావనను ఎన్నికల ప్రచారంలో తెస్తున్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ జిన్నాకు వారసుడంటూ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో కశ్మీర్‌లోకి పాకిస్తాన్‌ ఉగ్రవాదులు చొరబడేవారని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక చొరబాట్లను నియంత్రించామని చెబుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. చైనాను తాము కట్టడి చేస్తున్నామంటూ.. అసలు రాష్ట్రానికి సంబంధంలేని అంశాలను బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. వీరికి భిన్నంగా తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రచారం సాగిస్తున్న యోగీ ఆదిత్యనాథ్‌ ప్రజల మద్ధతు పొందుతారా? లేదా..? అనేది మార్చి 10వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలిపోతుంది.

Also Read : ఇప్పుడు రెండు భారతదేశాలు ఉన్నాయి – రాహుల్