Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంటోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తుటాల్లా పేలుతున్నాయి. రాజకీయాలు తారుమారు అవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారుమారు అవుతున్నాయి.
బీజేపీ నుంచి ఇటీవల టీఎంసీలో ముకుల్ రాయ్ చేరడంతో వివాదాలు మళ్లీ ముదురాయి. మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా అనర్హత అస్త్రాన్ని హైలెట్ చేస్తోంది. అయితే, టీఎంసీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన రాజకీయాలను లేవనెత్తుతోంది.
ముకుల్ రాజీనామా చేయాలట
గత ఎన్నికల్లో బీజేపీ తరపున కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుండి ముకుల్ రాయ్ గెలిచారు. అయితే ఈమధ్యే బీజేపీను వదిలేసి తృణమూల్ పార్టీలో చేరిపోయారు. దాంతో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి అనర్హత వేటు విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీ తరపున గెలిచి తృణమూల్లో చేరిన ముకుల్ వెంటనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలని సువేందు డిమాండ్ చేశారు. ఒకవేళ ముకుల్ రాజీనామా చేయకపోతే అనర్హత వేటు వేయిస్తామంటు హెచ్చరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే సువేందు ముకుల్ తదితరులంతా తృణమూల్లోని కీలక నేతలుగా ఉండేవారు. తర్వాత మమతతో విభేదించి బీజేపీలో చేరిపోయారు.
అప్పుడెందుకు చేయలేదు…
తృణమూల్ తరపున గెలిచి బీజేపీలోకి దూకూసినపుడు వీళ్ళెవరికీ తమ పదవులకు రాజీనామాలు చేయాలని అప్పట్లో అనిపించలేదు. ఎన్నికలకు ముందు సువేందు అధికారి తండ్రి సోదరుడు తృణమూల్ నుండి బీజేపీలోకి దూకారు. అప్పుడు తమ పదవులకు వాళ్ళు రాజీనామాలు చేయలేదు. అయితే ఇపుడు బీజేపీలో నుండి తిరిగి కొందరు ఎంఎల్ఏలు తృణమూల్లోకి వెళుతుంటే సువేందు తట్టుకోలేక రాజీనామాలని అనర్హత వేటని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తృణమూల్ నేతలు సువేందుపై ఎదురుదాడి చేస్తున్నారు.
తృణమూల్లో నుండి బీజేపీలోకి వెళ్ళినపుడు సువేందు కానీ ఆయన తండ్రి కానీ ఎందుకని రాజీనామాలు చేయలేదని నిలదీశారు. తృణమూల్లో నుండి బీజేపీలోకి వెళినపుడు తమ కుటుంబం ఏమిచేసిందో గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మొత్తంమీద ముకుల్ రాయ్ తృణమూల్లోకి వెళ్ళటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. అలాగే ఇంకా కొందరు ఎంఎల్ఏలు బీజేపీకి దూరమైపోతారనే ప్రచారాన్ని కమలనాదుల్లో టెన్షన్ మొదలైపోయింది.