iDreamPost
android-app
ios-app

భార‌త్‌ను ఆకాశానికి ఎత్తేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి..

భార‌త్‌ను ఆకాశానికి ఎత్తేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి..

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా కారణంగా ప్రపంచం మొత్తం కుదేలయింది. పరుగులు తీస్తున్న ప్రపంచం కాస్త ఇంటికే పరిమితం అయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కకావికలం అయ్యాయి. కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు.కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోగా ఎన్నో కోట్ల మంది కుటుంబ ఆర్ధిక పరిస్థితులు కరోనా కారణంగా ప్రభావితం అయ్యాయి.

ఈ దశలో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి పలు దేశాలు నడుం బిగించాయి. ఇప్పటికే పలు దేశాల్లో టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా లభించాయి. ప్రత్యేకంగా మోడెర్న,కామిర్నాటి,స్పుత్నిక్ వి లాంటి వ్యాక్సిన్లను పలు దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించగా, భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో ఆస్ట్రాజెనక,కోవాగ్జిన్ టీకాలను రూపొందించి అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.

కాగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత దేశ పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ భారత్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ల‌ను తయారు చేసే భారత సామర్థ్యం ప్రపంచానికే గొప్ప ఆస్తి అని ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు.

ఇప్పటికే భారత్ లో అనేక కోవిడ్ టీకాలు తయారవుతున్న విషయం ఐక్యరాజ్య సమితికి తెలుసని తాము భార‌త్‌లోని వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంటోనియో పేర్కొన్నారు. కోవిడ్ టీకా ప్రపంచ దేశాలకు త్వరగా పంపిణీ చేసేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాల తయారీ లైసెన్స్‌లను ఆయా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఐరాస ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలతో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారత్ లో ఆస్ట్రాజెనక,కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. అనంతరం భారత్ 55 లక్షల డోసులను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అందించగా త్వరలోనే ఆఫ్రికా దేశాలకు కోటి డోసులను, ఐక్యరాజ్య సమితికి 10 లక్షల డోసులను అందించేందుకు సిద్ధంగా ఉందని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అంతేకాకుండా కరీబియన్‌ దేశాలతో పాటు, ఒమన్‌, నికరాగ్వా, పసిఫిక్‌ ద్వీప దేశాలకు సైతం టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడిలో భారత దేశం కీలక పాత్ర పోషించబోతుందని తాజా పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది.