Idream media
Idream media
అన్‌లాక్ –3 కి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రెండో దశ ఆన్‌లాక్ ఈ నెల 31వ తేదీతో ముగుస్తోంది. సినిమా హాళ్లు, జిమ్‌లు, పార్కులు, స్కూళ్లు, మెట్రో రైళ్లుపైనే ప్రస్తుతం ఆంక్షలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఆన్‌లాక్ 3లో సినిమా హాళ్లు, జిమ్‌లకు సడలింపులు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించి హాళ్లు నిర్వహించుకునేలా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. 25 శాతం సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తుండగా.. థియేటర్ యాజమాన్యాలు 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక జిమ్‌లలోనూ భౌతిక దూరం పాటించి నిర్వహించుకునేలా అనుమతులు ఇవ్వనుంది.
సినిమా హాళ్లు తెరవడం ద్వారా సినీ పరిశ్రమలోని కార్మికులకు తిరిగి ఉపాధి లభించనుంది. సినిమా చిత్రీకరణలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే మరో వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు అందరినీ కలవరపెడుతోంది. లాక్‌డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా.. సడలింపులు ఇచ్చిన తర్వాత వ్యాప్తి వేగం పెరిగింది. ఇక అన్‌లాక్‌లు ప్రారంభం అయినప్పటి నుంచి కరోనా ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో జనాభా భారీగా గూమిగూడి, రెండున్నర గంటల పాటు కూర్చునే థియేటర్లు, గంటల పాటు ఒకే చోట ప్రజలు ఉండే జిమ్‌లకు కూడా అనుమతి ఇస్తే వైరస్ వ్యాప్తి ఇంక ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఆయా రంగాలపై ఇంకా ఆంక్షలు కొనసాగించడం కూడా సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దేశంలో వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే లాక్‌డౌన్‌లో నియంత్రణలోనే ఉంది. సడలింపులు ఇచ్చినప్పుడు వ్యాప్తి పెరిగింది. ఆన్‌లాక్‌లలో జోరుగా సాగిందని తెలుస్తోంది. దేశంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు జనవరి 30వ తేదీన వెలుగుచూసింది. మార్చి 25న లాక్‌డౌన్ పెట్టేదానికి దాదాపు రెండునెలల కాలంలో కరోనా కేసుల సంఖ్య 606కు చేరుకున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకూ మొదటి విడత లాక్‌డౌన్ అమలులో ఉంది. ఈ సమయంలో దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 10,363కు చేరుకుంది. ఇక రెండో దశ లాక్‌డౌన్ మే 3 వరకూ కొనసాగగా.. అప్పటికి పాజిటివ్ కేసుల సంఖ్య 39,980కు చేరుకున్నారు. వైరస్ కట్టడిలోకి రాకపోవడంతో మరో రెండు వారాలపాటు మూడో విడత లాక్‌డౌన్‌ను అమలు చేశారు. మూడో విడత లాక్‌డౌన్ ముగిసే మే 17 నాటికి 90,927 మంది వైరస్ బారినపడ్డారు.
అప్పటికే లాక్‌డౌన్ విధించి దాదాపు రెండు నెలలు కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్‌డౌన్‌ను విధిస్తూనే కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చింది. అందు కోసం వైరస్ ప్రభావం దృష్టిలో ఉంచుకుని దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకూ కొనసాగిన లాక్‌డౌన్ 4లో దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు మినహాయిపులు ఇచ్చారు. సడలింపులు ఇచ్చిన 21 రోజులపాటు అమలు చేసిన లాక్‌డౌన్ 4లో కొత్తగా 1,65,684 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో జూన్ 8 నాటికి వైరస్ బారిన పడిన వారి సంఖ్య మొత్తం 2,56,611కు చేరుకుంది.
జూన్ 8వ తేదీ నుంచి అన్‌లాక్– 1 మొదలైంది. ఇది జూన్ 30వ తేదీ వరకు కొనసాగింది. ఈ సమయంలో దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు, అంతర్రాష్ట్ర రాకపోకలకు అనుమతులు ఇచ్చారు. 22 రోజుల పాటు సాగిన అన్‌లాక్–1లో 3,10, 229 కొత్త కేసులతో కలుపుకుని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,66,840గా నమోదైంది. జూలై 1వ తేదీ నుంచి అన్‌లాక్ – 2 ప్రారంభమైంది. ఈ సమయంలో అన్‌లాక్ 1లోని సడలింపులు, మార్గదర్శకాలు మాత్రమే అమలవుతున్నాయి. ఈ నెల 1 నుంచి నిన్నటి వరకూ అంటే.. జూన్ 26వ తేదీ వరకూ అన్‌లాక్ – 2లో నూతనంగా 8,18,682 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 13,85, 522కు చేరుకుంది. ఆగస్టులో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కాబోయే ఆన్‌లాక్–3లో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుదన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.