Idream media
Idream media
గుప్తదానాలు అనే పేరు వింటుంటాం. దానం చేసే సమయంలో తమ పేరు తెలియపరచడం ఇష్టంలేని వ్యక్తులను గుప్తదాతలు అంటారు. దానాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ గుప్త అభిమానులు ఉన్నారు. రాజకీయ పార్టీల నేతలకు వివిధ సందర్భాల్లో శుభాకాంక్షలు తెలిపేందుకు వారి అనుచరులు, అభిమానులు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటారు. పేపర్లలో ప్రకటనలు, ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపే వారు.. వారి నాయకుడు ఫొటోతోపాటు వారి ఫొటో, పేరు కూడా అందులో పొందుపరుస్తారు. శుభాకాంక్షలు తెలియజేసే వారి ఫొటో, పేరు లేకుండా దాదాపుగా ఫ్లెక్సీలు, పోస్టర్లు కనిపించవు. కానీ విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో శుభాకాంక్షలు తెలియజేసే నాయకుడి ఫోటో మాత్రమే ఉండడంతో, వాటిని ఏర్పాటు చేసిన గుప్త అభిమానులు ఎవరా అనే చర్చ నడుస్తోంది.
విశాఖలో చర్చకు కారణమైన ఫ్లెక్సీలలో ఉన్న నేత మరెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా విశాఖ నగరంలోని పలు సెంటర్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. మద్దిలపాలెం, సత్యం జంక్షన్, గురుద్వారా, స్పెన్సర్, సిరిపురం జంక్షన్లలో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే విషయం ఎక్కడా కనిపించకపోవడంతో వీటిని ఎవరు..? ఎందుకు..? ఏర్పాటు చేసి ఉంటారనే చర్చ నడుస్తోంది.
ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. 2018 డిసెంబర్‌లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సందర్భాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, నరేంద్ర మోదీ తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ఆ తర్వాత మౌనంగా ఉంటున్నారు. కానీ ఇటీవల కేంద్ర బడ్జెట్ తర్వాత కేసీఆర్ మరోసారి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. బడుగు బలహీన వర్గాలు, దళితుల బతులకు మారలేదని, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు.
కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి అవసరం ఉందన్న కేసీఆర్.. అందుకోసం తాను కీలకంగా పనిచేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, కేరళ సీఎం విజయన్‌లతో మాట్లాడుతున్నారు. అవసరమైతే కేంద్రంలో ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కేసీఆర్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రతిపాదిత కార్యనిర్వాహక రాజధానిలో ఆయన జన్మదినం సందర్భంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయని అనుకుంటున్నారు. గులాబీ నేతలే స్థానికంగా ఉంటున్న వారి చేతనో లేదా నగరంలో ఉన్న కేసీఆర్ సామాజికవర్గ ప్రముఖులో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు.
Also Read : కేసీఆర్ జన్మదినం : టీఆర్‌ఎస్ శ్రేణుల భారీ ప్లాన్..!