Idream media
Idream media
జూన్ 15 శ్రీశ్రీ చనిపోయిన రోజు. ఒక మనిషి మరణించి 38 ఏళ్ల తర్వాత కూడా గుర్తుండాడంటే చిరంజీవి అని అర్థం. శ్రీశ్రీ మృతి గురించి రేడియోలో విని బాధగా ఉండింది. అప్పుడప్పుడే మహాప్రస్థానం పరిచయం. ఒక రకంగా ఆకలిరాజ్యం (1980) సినిమానే దగ్గర చేసింది. శ్రీశ్రీ కవిత్వంలోని భాష, సొగసు, ప్రాస అర్థమైంది కానీ, లోతు, గాఢత అర్థం చేసుకోలేని వయసు. సొసైటీ వుండాల్సిన విధంగా లేదని తెలుసు కానీ, ఎలా వుండాలో తెలియదు.
మరుసటి రోజు ఈనాడులో కత్తుల వంతెన దాటుతూ మరో ప్రపంచం కోసం వెళ్లిన శ్రీశ్రీ కార్టూన్ శ్రీధర్ వేశాడు. బెస్ట్ కార్టూన్. తర్వాత ఆంధ్రజ్యోతి వీక్లీ కవర్ పేజీ శ్రీశ్రీ ఫొటో. ఒక కమర్షియల్ వీక్లీ కవర్ మీద కవి ఫొటో రావడం నాకు తెలిసి మొదటిసారి. దాన్ని తీసుకెళ్లి Old Townలో ఫ్రేమ్‌లు కట్టే షాప్‌కి వెళ్లాను. ఫొటో ఫ్రేమ్ చేయమంటే రూ.13 అడిగారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. బేరం ఆడితే 2 రూపాయలు తగ్గి “ఎవరు ఈయన?” అని అడిగాడు.
“శ్రీశ్రీ” అని గర్వంగా చెప్పాను.
“అంటే?” అన్నాడు
“మహాకవి”
“నీకేమవుతాడు”
నాకంటే ఆయనకే ఎక్కువ అవుతాడు. బతికినంత కాలం శ్రమ జీవుల కోసం రాసాడు. 4 రోజుల తర్వాత ఫొటో ఇచ్చాడు. ఇంట్లో తగిలించుకున్నాను. అది చూసిన వాళ్లు నాకు మెంటల్ అనుకున్నారు. ఇల్లు మారే క్రమంలో అది పోయింది. కాలం మనల్ని శ్రీశ్రీ నుంచి దూరం చేసి శ్రీ (డబ్బు) కోసం వెంపర్లాడేలా చేస్తోంది.
రోజూ చదవడం వల్ల శ్రీశ్రీ పూనకం ఎక్కువైంది. టీనేజ్ , వేడి రక్తం. దెబ్బ తగిలితేనే చల్లారేది. ఏదో చేయాలనుకుని శ్రీధర్, జయరాజ్ అనే మిత్రులతో సమావేశం. అప్పటికే మాకు AISFతో అనుబంధం వుండేది. ఫీజుల రద్దుకి స్ట్రైక్ చేయడం, కృష్ణా జలాలు మళ్లించాలని స్లోగన్స్ ఇవ్వడం తప్ప ఒక మార్క్సిస్ట్ దృక్పథం లేని నాయకత్వంతో ఉండేది. శ్రీశ్రీని కాదు కదా సాహిత్యాన్ని కాసింత చదివిన వాళ్లు కూడా ఒకరిద్దరు లేని కాలం.
వాళ్లతో లాభం లేదనుకుని మేము ముగ్గరం మా సంస్థకి అభ్యుదయం అని మేమే పేరు పెట్టుకుని అర్ధరాత్రి జయరాజ్ ఇంటి నుంచి ఒక బకెట్‌లో నీలి రంగు కలుపుకుని (ఆల్రెడీ విఠల్ బిల్డింగ్‌లో బ్రష్ కొన్నాం) మూడు సైకిళ్లలో వెళ్లి జడ్జి బంగ్లాకి (ఇప్పుడు సత్యసాయి ఉమెన్ కాలేజ్) స్లోగన్స్ రాశాం. జయరాజ్ మంచి రాతగాడు. ఆ రోజుల్లో అనంతపురం మట్కా ఎక్కువుండేది. అందుకని మట్కా నీ శవాన్ని మోసే జట్కా ఈ టైప్ స్లోగన్స్ వదిలాం. ఇవి నా సృష్టే. అప్పటికే శ్రీశ్రీ ప్రభావం ఉంది కదా! క్షేమంగా ఇల్లు చేరాం. మరుసటి రోజు ఆ రూట్లో మా స్లోగన్స్ మేమే చదివి ఆనందపడ్డాం. అప్పట్లో అనంతపురం అనేక రకాల రాజకీయ వేదిక కాబట్టి మా అభ్యుదయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
జడ్జి బంగ్లా చాలా పెద్దది. ఖాళీ గోడలు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలని, నీలి రంగు ఇంకా మిగిలి ఉన్నందున , మరుసటి రోజు వీర ఉత్సాహంతో సైకిళ్లు తొక్కాం. ఎప్పటిలాగే శ్రీధర్ బకెట్, జయరాజ్ బ్రష్ తీసుకున్నారు. నేను ఊరికే నిలబడ్డాను. కాసేపటికి కోర్టు రోడ్డు నుంచి డిగ్‌డిగ్‌మని బుల్లెట్ శబ్దం. కీడు శంకించాను. బైక్ దగ్గరైంది. బ్రష్ , బకెట్ ఆగింది. బుల్లెట్ ఆగి ఒక పోలీస్ అధికారి , వెనుక కానిస్టేబుల్ కనిపించారు (ఆయన DSP అని తర్వాత తెలిసింది, ఆ రోజుల్లో DSPలు కూడా బైకే).
“ఎవర్రా మీరు?” అన్నాడు.
ముగ్గురం సైకిళ్లు ఎక్కి పరారు. నేను రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వైపు వెళ్లాను. అదంతా స్లమ్. చీకటి. లైట్లు లేవు. ఎవరి వెంట పడాలో తేల్చుకోడానికి DSPకి టైం పట్టింది. చివరికి నా వెంటే పడ్డాడు.
సైకిల్‌తో ఒక మూల గుడిసెల వెనుక దాక్కున్నాను. బుల్లెట్ శబ్దం హార్ట్ బీట్‌ను పెంచింది. బుల్లెట్ స్టాండ్ వేసి “ఈడే యాడో వుంటాడు చూడు” అన్నాడు DSP. ఆ శబ్దానికి గుడిసెల వాళ్లు నిద్ర లేస్తున్నారు. నేను తెగించి సైకిల్ తీశాను. చైన్ శబ్దానికి DSP “నిలబడరా” అని అరిచాడు.
నా అదృష్టం కొద్ది బుల్లెట్ స్టార్ట్ కాలేదు. అది స్టార్ట్ అయ్యేలోగా నేను ఆస్పత్రి వెనుక దొంగదారుల్లో ఇల్లు చేరిపోయాను. ఆ రూట్ DSPకి తెలిసే అవకాశం లేదు. శ్రీధర్ , జయరాజ్ దొరికిపోయి వుంటారు. తెల్లారి ఇంటికి పోలీసులు వస్తారు. భయం ఎలా వుంటుందో తెలిసింది. దాన్ని జయించకపోతే మనం ఎన్ని చదివినా వృథానే. భయానికి మించింది డబ్బు. దీన్ని ఎవరూ జయించలేరు.
తెల్లారుజామున ఇంటి ముందర శబ్దం అయితే జీవితం అయిపోయిందనుకున్నా. జయరాజ్ కనిపించాడు. ధైర్యం వచ్చింది. శ్రీధర్ గ్యారెంటీగా దొరికిపోయి వుంటాడు. వాళ్ల నాన్న వీరన్నకి టీచర్‌గా పెద్ద పేరు. తెల్లారేసరికి మొత్తం OUT. ఫోన్లు లేవు కదా, తెల్లారి 7 వరకూ ప్రాణ బిగపట్టుకుని అతని ఇంటికి వెళితే Safeగా వున్నాడు. సంతోషం మామూలుగా లేదు, మా మిత్రుడు మేఘరాజ్ వాళ్ల మదర్ సబ్ జడ్జి. రామ్‌నగర్‌లో వుండేవారు. శ్రీధర్ నేరుగా మేఘరాజ్ ఇంటికే వెళ్లి అక్కడే వున్నాడు. ఆ ఇంటికెళ్లే ధైర్యం పోలీసులకి వుండదు కదా?
మా వయసోళ్లంతా సైకిళ్లపై అమ్మాయిల ఇళ్ల చుట్టూ బీటు వేస్తుంటే, గోడలకి సున్నాలు కొట్టే పనిలో మేమున్నాం. తర్వాత సాహసాల జోలికెళ్లలేదు. శ్రీధర్ BSNLలో ఇప్పుడు వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. జయరాజ్ పరిణామ క్రమం గొప్పది. క్రైస్తవ భక్తి గీతాల గాయకుడిగా మారాడు. అనేక దేశాల్లో క్రీస్తు బోధనలు వినిపించాడు. కాకపోతే ఇంట్లోని బకెట్ ఎలా మాయమైందో జయరాజ్ వాళ్ల అమ్మకి ఎప్పటికీ తెలియలేదు. పని మనిషిని తిట్టింది. నాకే పాపం తెలియదంది. ఇంట్లో ఇన్ని వస్తువులుండగా బకెట్ కోసం దొంగలు ఎందుకొచ్చారో కన్ఫ్యూజన్ (ఇప్పుడు చనిపోయారు).
జర్నలిస్టుగా శ్రీశ్రీ నాకు ఉపయోగపడ్డాడు. హెడ్డింగ్‌లు పెట్టడంతో ఎపుడూ తడుముకోలేదు. మా మామ సింగమనేని నారాయణకి శ్రీశ్రీ కంఠస్తం. ఆయన నోట్లో శ్రీశ్రీ జలపాతంలా దూకేవాడు.
ఇన్నాళ్ల తర్వాత చూసుకుంటే , మొదలు పెట్టిన దారిలో ఎవరూ లేరు. జీవితం చాలా తీసుకుంటుంది. కొన్నే ఇస్తుంది. సంపాయించే కంటే మనం పోగొట్టుకునేదే ఎక్కువ, ముఖ్యంగా విలువలు.