రాజకీయాల్లో కొన్ని కలయికలు చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆ ఇధ్దరు నాయకులు వేర్వేరు పంథాల్లో నడిచినా, తాజాగా వారి నడుమ జరిగిన భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఇద్దరే కేసీఆర్, ఉండవల్లి అరుణ్ కుమార్.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచిస్తోంది. అందుకు తగ్గట్లుగా భారత రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో వీరి భేటీకి గల కారణాలను మంగళవారం వెల్లడిస్తాన్ని ముందుగా చెప్పిన ఉండవల్లి, ఆ తరువాత ఉన్న పళంగా ప్రేస్ మీట్ నిర్వహించారు.
కేసీఆర్ తనతో ఫోనులో మాట్లాడిన సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడు కలవాలని కోరినట్లు చెప్పారు. ఆదివారం నాడు లంచ్ కు పిలవగా దాదాపు 5 గంటలు సంభాషించారని అన్నారు. అయితే జాతీయ పార్టీ అంశంపై మాత్రం ఏ చర్చా జరగలేదని తేల్చారు ఉండవల్లి.
బిజెపి గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత బలంగా బిబెపి ఇంకెక్కడా లేదని అన్నారు. ఏపీలో ఉన్న ఏ పార్టీ కూడా బిజెపిని వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు.అయితే బిజెపి విషయంలో కేసీఆర్ కు, తనకు ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కు స్పష్టత ఉందన్నారు. అందుకే బిజెపికి వ్యతిరేకంగా వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రశాంత్ కిశోర్ సైతం ఉన్నట్లు ఉండవల్లి తెలిపారు.