iDreamPost
android-app
ios-app

పుదుచ్చేరిలో ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారంలో ఊగిస‌లాట : రంజుగా కూటమి రాజ‌కీయం

పుదుచ్చేరిలో ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారంలో ఊగిస‌లాట : రంజుగా కూటమి రాజ‌కీయం

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పేరుకే ఎన్డీయే కూటమి త‌ప్పా.. ప్ర‌చారం నుంచి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కూ ప్ర‌తీ విష‌యంలోనూ అందులో ప్ర‌ధాన పార్టీలైన ఎన్ ఆర్ కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌ర వాద‌న‌లే. ఎలాగోలా గెలుపు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ మొద‌ట్లో ముఖ్య‌మంత్రి పీఠం తమకు కావాలంటే, త‌మ‌కు కావాల‌ని బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్ వాదించుకున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలున్న పుదుచ్చేరి శాసనసభకు ఇటీవల వెల్లడైన ఫలితాల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10 స్థానాలను, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్‌ 2, స్వతంత్రులు ఆరు స్థానాలను కైవసం చేసుకున్నాయి. బీజేపీ పేచీతో అవసరమైతే డీఎంకే, కాంగ్రెస్‌ల మద్దతు తీసుకుని పీఠం ఎక్కేందుకు సిద్ధమ‌య్యారు రంగ‌స్వామి. చివ‌ర‌కు పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన బీజేపీ ముఖ్యమంత్రిగా రంగస్వామికి జై కొట్ట‌డంతో క‌థ సుఖాంత మైంది.

ఆ త‌ర్వాత మ‌రో లొల్లి మొద‌లైంది. ముఖ్యమంత్రి పదవి కోసం విఫలప్రయత్నం చేసిన బీజేపీ, ఉపముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ పదవితో పాటు రెండు మంత్రి పదవులు కావాలని ఎన్‌.రంగస్వామి ముందు డిమాండ్లు ఉంచింది. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన రంగస్వామి.. స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అన్నారు. ఈ లొల్లి ఇలా కొన‌సాగుతుండ‌గానే ఈ నెల 7న పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ప్ర‌మాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఆరుగురు సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇటువంటి సంప్రదాయం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో లేదు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏ నమశ్శివాయంకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం బీజేపీ అధిష్ఠానం నుంచి అనుమతి రావలసి ఉందని ఈ కూటమి వర్గాలు పేర్కొంటుండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారమే జ‌ర‌గ‌లేదు.

ఈ నెల 9నే ప్రొటెమ్‌ స్పీకర్‌గా కె లక్ష్మీనారాయణన్‌ను నియమిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై వ‌ద్ద‌కు ఫైల్ వెళ్లింది. ఫైల్‌ను పంపి 10 రోజులు దాటినా ఇంకా ఎల్‌జి ఆమోదించలేదు. ప్రొటెమ్‌ స్పీకర్‌ను నియమిస్తే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మార్గం సుగమం అవుతుందనే సంగతి తెలిసిందే. కరోనాకు చికిత్సకు చెన్నై వెళ్లిన రంగసామి ఈ నెల 17న పుదుచ్చేరికి తిరిగివచ్చారు. అయినా రంగసామి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. మరోవైపు అసెంబ్లీకి కేంద్రం ముగ్గుర్ని నామినేట్‌ చేయవచ్చుననే నిబంధనను బిజెపి ఉపయోగించుకుంది. ఈ నెల 10న కె.వెంకటేశం, వి.పి రామలింగం, ఆర్‌.బి. ఆశోక్‌బాబులను ఎమ్మెల్యేలుగా నామినేట్‌ చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నామినేట్‌ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఓటు వేసే అధికారం ఉంటుంది. దీనికితోడు స్వతంత్ర అభ్యర్థులతో బిజెపి బేరసారాలు సాగిస్తోంది. ఆరుగురు స్వతంత్రుల్లో ముగ్గురు బిజెపి వైపు చేరారు. మొత్తం 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో బిజెపి బలం 12కు చేరుకుంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కన్నా ఇద్దరు అధికంగా ఉన్నారు.

ఈ నెల 2న బిజెపి ఉప ముఖ్యమంత్రి, స్పీకర్‌ పదవుల్ని కోరింది. ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న రంగసామి స్పీకర్‌ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వనని తేల్చిచెప్పారు. స్పీకర్‌ను ఉపయోగించుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బిజెపి ఎలా కూల్చివేసిందో రంగసామికి బాగా గుర్తుంది. 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు గరిష్టంగా ఏడుగురు మంత్రులు ఉండవచ్చు. కొన్ని మంత్రి పదవులపై బిజెపి పట్టుదలగా ఉందని, అందుకే ప్రోటెం స్పీకర్‌ నామినేట్‌ చేసే ఫైల్‌ను ఎల్‌జి ఇంకా ఆమోదించలేదని సమాచారం. రంగ‌స్వామి క్వారంటైన్ లో ఉండ‌డంతో ఈ స‌స్పెన్స్ ఎప్పుడు వీడుతుందో, ఎటువంటి మ‌లుపు తిరుగుందో అర్థం కావ‌డం లేదు. ముఖ్య‌మంత్రి రంగ‌స్వామిపై ఒత్తిడి తెచ్చి త‌మ‌కు కావాల్సిన ప‌ద‌వుల‌ను సాధించుకునేందుకు బీజేపీ అన్ని ర‌కాలుగానూ పావులు క‌దుపుతోంది. త‌న బ‌లం పెంచుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలో పుదుచ్చేరి రాజ‌కీయం ఎటువంటి మ‌లుపు తిరుగుతోంద‌న‌న్నఆస‌క్తి ఏర్ప‌డుతోంది.