Idream media
Idream media
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి యూకే వెళ్లిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎట్టకేలకు భారత్ కు రానున్నారు. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్ కోర్టు తీర్పు చెప్పింది. ఆయనపై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ మోదీ చేసిన ప్రయత్నాలన్నింటికీ కోర్టు చెక్ పెట్టింది.
భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్ చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసులో లండన్ కోర్టు గురువారం (ఫిబ్రవరి 25) కీలక తీర్పు చెప్పింది. నీరవ్ మోదీ సాక్ష్యాలను నాశనం చేశారని తెలిపింది. ఆయనకు మానసిక స్థితి సరిగాలేదనే వాదనను కోర్టు కొట్టి పారేసింది. భారత్‌లో నీరవ్ మోదీకి న్యాయం జరగదనే వాదనకు ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని స్పష్టం చేసింది. ఆర్థర్ రోడ్డు జైలులో (ముంబై) బరాక్ నంబర్ 12లో నీరవ్ మోదీ కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు భారత్ తెలిపిందని.. సమగ్ర వివరాలు సమర్పించిందని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వెల్లడించారు.
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సామ్యూల్ గూజీ ఈ తీర్పు చెప్పారు. వాండ్స్‌వర్త్ జైలు నుంచి నీరవ్ మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణలో పాల్గొన్నారు. లండన్ పోలీసులు ఆయణ్ని 2019 మార్చి 19న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. యూకే కోర్టు ఆదేశాల మేరకు లండన్ అధికారులు నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించే ముందు కొన్ని లాంఛనాలను (ఆరోగ్య పరీక్షలు తదితరాలు) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా నీరవ్ మోదీకి కోర్టు కల్పించింది. మరింత ఆలస్యం చేయడానికి నీరవ్ మోదీ ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ లోగా మరిన్ని ఎత్తులు వేసే అవకాశం కూడా లేకపోలేదు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన భారత్ నుంచి లండన్‌కు వెళ్లిపోయారు. నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. లండన్‌లో తన ఆచూకీ బయటకు తెలియకుండా కొంతకాలం జాగ్రత్తపడ్డ నీరవ్ మోదీ 2019 ఆరంభంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చారు.
లండన్‌లో సుమారు రూ.73 కోట్ల ఖరీదైన త్రీ బెడ్‌రూం అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారన్నది టెలిగ్రాఫ్ కథనం వెల్లడించింది. ఆ తర్వాత ఆయన్ను బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. మోసం, మనీ లాండరింగ్ అభియోగాల కింద ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరవ్‌కు వ్యతిరేకంగా యూకే కోర్టుకు భారత్ 16 సంపుటాల ఆధారాలను సమర్పించింది. నీరవ్ మోదీ సాక్షులను భయపెట్టారని, లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని కోర్టులో భారత్ వాదనలు వినిపించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తూ యూకే కోర్టు తీర్పు వెలువరించింది. ఆయనపై దాఖలైన కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సబబేననీ.. దీనిపై ఆయన భారత్‌కు సమాధానం చెప్పాల్సిందేనని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది.
ముంబయిలోని బ్రీచ్‌క్యాండీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ.11,360 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆ బ్యాంకు 2018 ఆరంభంలో వెల్లడించింది. ఈ కుంభకోణం 2011 నుంచి 2018 వరకు కొనసాగిందని, ఏడేళ్లలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని బ్యాంకు ఉన్నతాధికారులు చెప్పారు.
ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. నీరవ్ మోదీ ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును సంప్రదించారు. ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగారు. విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకు ఆయనకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LOU) ఇచ్చింది. అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసే వారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది. కానీ, బ్యాంకు అధికారులు నకిలీ LOUలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు అనుమానం రాలేదు. దాంతో నిధులు విడుదల చేశాయి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.
దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు పీఎన్‌బీకి రుణం ఇచ్చేశాయి. ఆ తర్వాత ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు. పాత రుణాలకు కూడా కొందరు పీఎన్‌బీ అధికారులు కొత్తగా LOUలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు. కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇదంతా 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగింది. కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత లండన్ కు పరారైన నీరవ్ మూడేళ్ల అనంతరం భారత్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.