Idream media
Idream media
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన విరమించుకోవాలని అమరావతిలోని కొన్ని గ్రామాల ప్రజలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ముగింపు హింసాత్మకంగానే జరగాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారా..? అంటే చంద్రబాబు గత చరిత్ర, తాజాగా ఈ రోజు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తల దాడి ఘటన ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఈ రోజు రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సమావేశమవబోతోంది. రేపు మంత్రివర్గం సమావేశం జరగబోతోంది. మూడు రాజధానులపై మంత్రివర్గంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపధ్యంలో చంద్రబాబు ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ద్వారానే ముగించి మరో కొత్త కొణం ఎత్తుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమరావతి ఉద్యమాన్ని రగిలించాలని చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ఉద్యమ సమయంలో కూడా బయటకు రాని తన భార్య భువనేశ్వరిని అమరావతి ఉద్యమానికి తీసుకొచ్చారు. తన చేతికున్న ప్లాటినం గాజును ఉద్యమానికి విరాళంగా ఇప్పించి మహిళా సెంటిమెంట్‌ను లేపాలనుకున్నారు. దీనికి కొనసాగింపుగా గాంధీజీ చేసిన స్వాతంత్ర పోరాటం కోసం అప్పట్లో మహిళలు తమ ఆభరాణాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ అ స్థాయిలో అమరావతికి ఇస్తున్నారంటూ పోల్చారు. ఈ పోలిక హాస్యాస్పదమైంది తప్ప ఫలితం రాలేదు. విద్యార్థులను పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉదోగులు చేవ చచ్చారా..? అంటూ పరుషవ్యాఖ్యలు చేశారు. ఇన్ని చేసినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని, ఇక ఉద్యమం కొనసాగించడం సాద్యం కాదని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.
Read Also: అమరావతి ఉద్యమం ఎవరికోసం?
ఈ నెల 20వ తేదీన విశాఖలో సచివాలయం ప్రారంభం కాబోతుందని, ఈ మేరకు శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యమం ప్రస్తుత పంథాలోనే కొనసాగించడం కష్టమవుతుందన్న అంచనాకొచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు హింసాత్మకం వైపు ఉద్యమాన్ని మళ్లించి ముగించాలనే జాతీయ రహదారి దిగ్భందన కార్యక్రమం పెట్టించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాజా టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమేనని వారంటున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే రైతులతో కలసి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు సర్వీస్‌రోడ్డులో వెళుతున్న ఎమ్మెల్యే కారుపై దూరం నుంచి రాళ్లు రువ్వారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వద్దకు వచ్చి వాగ్వాదం చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు తాగి ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్టారెడ్డి చెబుతుండడం టీడీపీ లక్ష్యమేమిటో అర్థమవుతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బషీర్ బాగ్ ఉద్యమం, అధికారంలో లేకున్నా తన నాయకత్వంలో వచ్చిన అమరావతి ఉద్యమం.. ఇలా హింసాత్మకంగానే అన్ని ఉద్యమాలకు ముగింపు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also :చురుగ్గా సర్కారు-అమరావతి ఉద్యమ పయనం ఎటు?
ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మళ్లీ చంద్రబాబు కుమారుడు మాజీ మంత్రి లోకేష్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడులను దాడి జరిగిన కాజా టోల్ ప్లాజా వద్దకు వెళ్లాలని ప్రయత్నించడం, వారిని పోలీసులు అరెస్ట్ చేయడం… ఇవన్నీ చంద్రబాబు ప్లాన్‌లో భాగమనేని తెలుస్తోంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులపై ఉక్కుపాదం మోపారని, 33 వేల ఎకరాలు త్యాగం చేసిన వారిని జైలుకు పంపి వారికి జగన్ మంచి బహుమతి ఇచ్చారంటూ రేపు చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడినా ఆశ్చర్యం లేదు.