Idream media
Idream media
ఉదయంలో నేను పనిచేయలేదు. కానీ జర్నలిస్టుగా మారడానికి అదే ప్రేరణ.
ఉదయం రావడం రావడమే ఒక సంచలనం. ప్రింటింగ్ క్వాలిటీతో పాటు చదివించే శైలి, కథనాలు అద్భుతంగా ఉండేవి. రాయలసీమలో ఈనాడుకి ముందు ఆంధ్రప్రభ రాజ్యమేలేది. వారం క్రితం సద్ది వార్తలు (జిల్లా న్యూస్) మోసుకుని రాయదుర్గం లాంటి చిన్న ఊళ్లకి నిదానంగా సాయంత్రం వచ్చేది. ఈనాడు వచ్చి తెల్లారగానే పేపర్ చదవడం అలవాటు చేసింది. అయితే అది తెలుగుదేశం కరపత్రికగా మారిన ఒక సంక్లిష్ట సమయంలో ఉదయం వచ్చింది. టీడీపీలోని లోపాలను విప్పి చెప్పేది. అందుకే అంత ఆదరణ దక్కింది.
తెలుగు సాహిత్యంలో పీజీ చేసిన తర్వాత , నా క్లాస్‌మేట్స్ అంతా ఎంఫిల్ చదివి లెక్చరర్స్ అయ్యే సన్నాహాల్లో ఉన్నారు. కానీ నా దృష్టి అంతా జర్నలిస్టు అవ్వాలనే. క్లాస్ రూమ్‌లో మనుచరిత్ర పాఠాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. జర్నలిస్టుగా ఏదో రాసేయాలనే ఆవేశం (జర్నలిస్టుగా జీవితంలో థ్రిల్ ఉంటుంది కానీ, అది జీవించడానికి పనికి రాదని నాకప్పటికీ తెలీదు). అయితే పత్రికల్లో ఎలా చేరాలో నాకు తెలీదు.
అప్పుడు ఉదయం పత్రికలో ప్రూఫ్ రీడర్లు కావలెను అని యాడ్ పడింది. భాషపై పట్టు ఉన్నవారు అప్లై చేయమని కోరారు. చేస్తే ఫలానా రోజు అజామాబాద్ ఉదయం ఆఫీస్‌లో టెస్ట్ అని కాల్ లెటర్ పంపారు. 1987లో అనంతపురం నుంచి హైదరాబాద్‌కి పెద్దగా బస్సులు లేని కాలం. కనీసం 200 ఖర్చు. ఎలాగో అవస్థలు పడి హైదరాబాద్ చేరుకుని ఉదయం ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తే పది గంటలకి టెస్ట్ అన్నవాళ్లు 11 గంటలకి పెట్టారు. అచ్చు తప్పులు ఏరివేయడం , ఒక చిన్న వ్యాసం, ఆ టెస్ట్ ఎంత సిల్లీగా అనిపించిందంటే, అప్పటికే నేను కథా రచయితని, ఒక నవల కూడా రాసిపడేసిన వాన్ని.
వచ్చిన పది మందిలో నేనే ఫస్ట్. జీతం రూ.600. ఎక్కడ ఉంటావని అడిగారు. అనంతపురంలో అన్నాను. ఉలిక్కి పడి ‘హైదరాబాద్‌లో కాదా’ అన్నారు. కాదన్నాను.
రూ.600తో నువ్వు హైద్రాబాద్‌లో బతకలేవు. ఈ ఉద్యోగం హైద్రాబాద్‌లో ఉన్నవాళ్లకు (లోకల్స్‌కి) అన్నారు. అప్లికేషన్‌లో స్పష్టంగా నా అడ్రస్ అనంతపురం అని రాస్తే ఎందుకు కాల్ లెటర్ పంపారు? ఇంత దూరం ఎందుకు రప్పించారు అని అడిగాను. బాధ్యత లేకుండా కంగాళీగా నిరుద్యోగులతో ఆడుకోవడం కరెక్టేనా అనే అర్థమొచ్చేలా మాట్లాడితే కొంచెం కంగారు పడి నీకు గ్యారెంటీగా జాబ్ ఇస్తాం. ఇంటికెళ్లిపో లెటర్ పంపుతామన్నారు. నాకు ఉద్యోగం రాలేదు. అది నా అదృష్టం. ఎందుకంటే ఉదయం పతనాన్ని ఉద్యోగిగా నేను మోయాల్సి వచ్చేది.
1988లో తిరుపతి ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం. అప్పటికే ఉదయంలో గందరగోళ పరిస్థితులు. ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్లు. జనరల్ డెస్క్‌లో అనుభవం లేని వాళ్లని షిప్ట్ ఇన్‌చార్జ్‌లుగా వేసేవాళ్లు. బాగా రాసేవాళ్లని హింసించేవాళ్లు. దాని స్వర్ణయుగం కళ్ల ముందే మాయమైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి టాప్‌లోకి వెళ్లి ఉదయం మూడో స్థానంలోకి వెళ్లింది.
సంచలనాలు మాయమై ఆబ్లిగేషన్ వార్తలు మొదలయ్యాయి. దాసరి నిజంగా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అది చాలా తొందరగా ఒక బుడగలా పేలి పోయింది.
యాజమాన్యం మారింది. జర్నలిస్టులు, ఉద్యోగుల కష్టాలపాలయ్యారు. న్యాయం కోసం చాలా కాలం పోరాడారు. ప్రయోజనం లేకుండా పోయింది. భుజాల మీద చేతులు వేసి పలకరించిన నాయకులు మాయమయ్యారు. చాలా నిస్సహాయ స్థితిలో కొందరు ఇతర పేపర్లకు వెళ్లారు. కొందరు జర్నలిజాన్ని వదిలేశారు.
జర్నలిస్టుల స్వేచ్ఛ తగ్గి , మేనేజర్ల రాజ్యం వస్తే ఇక ఆ పేపర్ బతకదు. దీనికి తర్వాతి ఉదాహరణ ఆంధ్రజ్యోతి. 96 నుంచి నాలుగేళ్లు పాటు సరిగ్గా జీతాలు ఇవ్వకుండా హింసించి హింసించి మూత పడింది. ఉదయం నుంచి ఏమీ నేర్చుకోలేక పోయింది. తర్వాత వార్తకి కూడా ఇదే గతి పట్టింది.
తర్వాతి రోజుల్లో జర్నలిజంలో నిజం మాయమై ఎవరి నిజాలు వాళ్లు రాసుకునే స్థితి వచ్చింది. కరోనా దెబ్బకి ఏది రాసినా జనం పట్టించుకోవడం లేదు.
ఈ మొత్తం యుద్ధంలో రాజులంతా క్షేమం. పోయింది సైనికులే. దాసరి, మాగుంట, సంఘి వీళ్లకు వచ్చిన నష్టాలేం లేవు. రోడ్డున పడింది జర్నలిస్టులే.
పచ్చళ్ల వ్యాపారం నుంచి ఈనాడు పెట్టి , ఆ నిచ్చెన మీద కాళ్లు పెట్టి ఎదిగిన రామోజీరావు కూడా బీద అరుపులు అరుస్తూ లే ఆఫ్ ప్రకటించాడు. ఇదో విషాదం.
జర్నలిజానికి భవిష్యత్ లేదు. నిజమే. కానీ నిజం చెప్పే వాడి కోసం ప్రపంచం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది.