iDreamPost
android-app
ios-app

రెండు విషయాల్లో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి

రెండు విషయాల్లో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉన్న స్థితిలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించి పార్టీకి తిరిగి పునర్వైభవం సంపాదించేందుకు రేవంత్ రెడ్డి వేస్తున్న ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు విషయాల మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకటి అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలను డీల్ చేయడం, రెండు క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ తనతో కలిసి రావాలని ఇంటింటికి వెళ్లి మరి ఆహ్వానించాడు. అసంతృప్త నేతలను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మాట వినని వారిని హై కమాండ్ ద్వారా మాట వినేలా చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఉదాహరణ కోమట్ రెడ్డి వ్యవహారం.

సీనియర్ నేతలు ఎవరు తనతో కలిసి రాకపోయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. హైకమాండ్ ఆశీర్వాదం కూడా తనకే ఉండడంతో సీనియర్లు వచ్చినా రాకున్నా తాను ముందుకు వెళ్తాను అన్న సంకేతాలు ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న నేతలు కూడా ఎం చేయలేక సైలెంట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలు రేవంత్ రెడ్డి ముందున్న సవాల్ అని అందరూ భావించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు అప్పగించినట్లు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపాలంటే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపట్టాలని భావించిన రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోర గర్జన పేరుతో వరుస సభలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. దళిత గిరిజన దండోర గర్జన సభలలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అంటూ పంచ్ డైలాగులు పేలుస్తూ కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి ఏం జరగలేదని అప్పులు మాత్రమే మిగిలాయని ఎద్దేవా చేస్తున్నారు. వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Also Read : టిఆర్ఎస్ ధర్మపురి అర్వింద్ ను ఎందుకు టార్గెట్ చేసింది..?

అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న కాంగ్రెస్లో సీనియర్ నేతల గ్రూపు రాజకీయాలను కూడా సైలెంట్ గా డీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.వ్యక్తి కేంద్రంగా కాకుండా కార్యకర్తలు, పార్టీ కేంద్రంగా పార్టీలో పనిచేయాలని అలా పనిచేసిన వారి ఇంటికి పదవులు నడుచుకుంటూ వస్తాయని ఇటీవల యూత్ కాంగ్రెస్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లి లో రెండు రోజుల దీక్షకు పిలుపునివ్వడంతో డైరెక్ట్ కేసీఆర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడుచింతలపల్లిలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు. గ్రామంలో 57 ఏళ్లు నిండిన వారిలో ఎంతమందికి పింఛను ఇచ్చారని ప్రశ్నించారు.

”చిన్న ముల్కనూరు గ్రామాన్ని 2015 ఆగస్టు 8న దత్తత తీసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పి గ్రామంలోని 247 ఇళ్లను పది రోజుల్లో నేలమట్టం చేశారు. కానీ, మూడేళ్లయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించలేదు. వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలు వేసుకుని ఉంటున్నారు” అని రేవంత్‌ ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సీఎంను విమర్శించడం రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామంది నేతలు మళ్ళీ కాంగ్రెస్ లొకి తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్గత ప్రజాస్వామ్యం, గ్రూప్ రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ కూడా హుజూరాబాద్ కే..!