యనమల రామకృష్ణుడు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి…ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేత. కాగా తాజాగా టెలీమెడిసిన్ కు వైఎస్సార్ పేరు పెట్టడడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషంగా ఉన్నాయి. సామాన్యుడు కూడా వాడకూడని, మాట్లాడకూడని పదాలను ఒక మాజీ స్పీకర్ అయ్యుండి ప్రయోగించడం నిజంగా దురదృష్టకరం.
ఆ పేర్లయితే ఓకేనా…
టెలీమెడిసిన్.. నేరుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండానే ఫోన్, ఇతర వర్చువల్ మార్గాల్లో వైద్య సహాయం అందించే విధానం. ఇది విదేశాల్లో చాలా కాలం నుంచే అమల్లో ఉంది. కరోనా నేపథ్యంలో పేషంట్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ టెలీమెడిసిన్ కార్యక్రమం ప్రారంభించింది. అంతే టెలీమెడిసిన్ కు వైఎస్సార్ పేరు పెడతారా…! కరోనాకి కూడా వైఎస్సార్ కరోనా…జగన్ కరోనా అని పేర్లు పెట్టండంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు యనమల. దీంతో టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ విద్యోన్నతి, చంద్రన్న బీమా అంటూ పదుల సంఖ్యలో పథకాలకు మామా అల్లుళ్ల పేర్లు పెట్టుకున్నప్పుడు రాని ఉక్రోషం ఇప్పుడే ఎందుకొస్తోందో అంటూ కౌంటర్లు పడుతున్నాయి.
ఆయన చేసిందేంటి…!
అదే పనిగా అసత్యాలు ప్రచారం చేసే ఓ పత్రికకు యనమల నిన్నో వ్యాసం రాశారు. దానికి ప్రజాస్వామ్యం మహా పతనం అనే శీర్షిక పెట్టారు. అందులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ ప్రజాస్వామ్యాన్ని ఏదేదో చేస్తున్నట్టు విమర్శల వర్షం కురిపించారు. స్థానిక సంస్థలల్లో బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈ విధంగానే టీడీపీలోకి లాక్కున్నారా అంటూ కామెంట్లు పడుతున్నాయి. పైగా మహిళా అధికారులు, పోలీసులపై సొంత పార్టీ నాయకులు దాడులకు తెగబడినప్పు ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందా అంటూ ప్రతి విమర్శలొస్తున్నాయి.
ప్రల సొమ్ము..నాకైతే ఒకే…!
యనమల తరుచూ జగన్, అతని నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సొమ్మును దుబారా చేస్తోందని, సొంతానికి వాడుకుంటోందని విమర్శిస్తూ ఉంటారు. కానీ, ఆయన మాత్రం మంత్రిగా ఉన్న సమయంలో ప్రజల సొమ్ముతో సింగపూర్ లో పంటి చికిత్స చేయించుకుంటారు…! అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఢిల్లీలో ఒక రోజు దీక్షకు రూ.10 కోట్లు, హైదరాబాద్ లోని చంద్రబాబు కుటుంబానికి నెలకు లక్ష రూపాయల వెచ్చించే సమయంలో అది ప్రజల సొమ్మని ఈ యనమలకు గుర్తురాకపోవడం కాదు శోచనీయం. బహుశా దీన్నే రెండు నాలుకల ధోరణి అంటారేమో …!
సుద్దులు చెప్పేందుకే…
యనమల టీవీ ఛానళ్లు, పత్రికలలో ప్రభుత్వానికి అనేక సుద్దులు చెప్తుంటారు. కానీ, గతంలోకెళ్తే రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వని వ్యక్తిగా తారసపడతారు. యనమల తీరుతో అప్పట్లో ఎన్టీఆర్ కన్నీటి పర్యంతం కావాల్సి వచ్చింది. ఓ పక్క నీతిమంతుడిలా నటిస్తూనే తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ కు కాంట్రాక్టులు ఇప్పించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అలాగే అల్లుడు వరసయిన ఐఆర్ఎస్ అధికారి వెంకట గోపీనాథ్ ను ఏపీ మెడికల్ అండ్ ఇఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించటంలో యనమల హస్తం ఉందంటారు. మామ అండతో గోపీనాథ్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటారు. నల్గొండకు చెందిన ఓ మెడికల్ కాంట్రాక్టర్ నుంచి రూ.65 లక్షల విలువ చేసే ల్యాండ్ రోవర్ కారును బహుమానంగా అందుకున్నట్లు గోపీనాథ్ పై ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా యనమల గురివింద గింజ నీతులు చెప్పకుండా కాస్త గతాన్ని గుర్తెరిగి ప్రవరిస్తే మంచిది లేదంటే తుని ప్రజలు ఎన్నికల నుంచి పదే పదే సాగనంపినట్టు…మిగిలిన ప్రాంతాల ప్రజలూ చీదరించుకుంటారు.