iDreamPost
android-app
ios-app

ఇద్దరు నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు

ఇద్దరు నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు

ప్రజల అనారోగ్యాన్ని ఆధారంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల భాగోతం బయటపడింది. దాదాపు రెండేళ్ల పాటు దర్జాగా హాస్పిటల్ నిర్వహించిన ఈ నకిలీ డాక్టర్ల గుట్టు విచారణలో బయటపడింది.

వివరాల్లోకి వెళితే కరోనా రోగులకు వాడే రెమిడెసిమీర్‌ ఇంజెక్షన్లకు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కాగా అరెస్ట్ చేసిన వారిలో సమీర్‌ ఆసుపత్రి మెడికల్‌ షాప్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న మహ్మద్‌ ఒబేద్‌ కూడా ఉన్నాడు. కాగా కరోనా మెడిసిన్ ని బ్లాక్ మార్కెట్ కి తరలించడంలో హాస్పిటల్ నిర్వాహకుల ప్రమేయం ఏమైనా ఉందా అని లోతుగా విచారణ చేయడంతో ఈ నకిలీ డాక్టర్ల గుట్టు బయట పడింది.

సమీర్ హాస్పిటల్ నిర్వహకుల్లో మహ్మద్ అబ్దుల్ ముజీబ్ కేవలం పదో తరగతి మాత్రమే చదవగా మహ్మద్‌ షోయబ్‌ సుభానీ మాత్రం ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ రెండో సంవత్సరంలో నిలిపివేశాడు. ఆ తర్వాత హుమాయున్‌నగర్‌లోని ఎంఎం హాస్పిటల్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. హాస్పిటల్ నిర్వహణలో భారీ లాభాలు వస్తాయని తెలుసుకున్న మహ్మద్‌ షోయబ్‌ సుభానీ తన స్నేహితుడితో కలిసి హాస్పిటల్ నడపాలని పథకం వేసాడు.డాక్టర్ గా నకిలీ ఆధార్ కార్డును పొంది 2017లో డీఎంఅండ్‌ హెచ్‌ఓకు దరఖాస్తు చేసుకుని ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి పొందారు. ఈ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలో సమీర్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేశారు.

గత మూడేళ్ళుగా ఎలాంటి అనుమానం రాకుండా వీరిద్దరూ హాస్పిటల్ నిర్వహించడం విశేషం. కాగా కరోనా మందును బ్లాక్ మార్కెట్ కు విక్రయిస్తున్న ముఠాలో ఈ హాస్పిటల్ కి చెందిన వ్యక్తి కూడా ఉండడంతో హాస్పిటల్ నిర్వాహకుల హస్తం ఉందేమో అన్న అనుమానంతో లోతుగా విచారణ చేపట్టడంతో ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారం బయట పడింది..దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి ఆసీఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు.