అనేక దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, చీరాల శాసనసభ్యుడు కరణం బలరామ కృష్ణమూర్తి (కరణం బలరాం) ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరుతున్న సందర్భంగా ఆయన చేరికపై వైసిపి తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో పెద్దఎత్తున చర్చకు తెర లేచింది. కరణం బలరాం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించటంతో నష్ట నివారణలో భాగంగా చంద్రబాబు పర్చూరు ,అద్దంకి శాసనసభ్యులతో అత్యవస సమావేశం నిర్వహించారు.
ప్రకాశం జిల్లా నుండి పలువురు తెలుగుదేశం నేతలు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న ఈ సమయంలో గతంలో 1994 ఎన్నికల రోజుల్లో కరణం బలరాం టీడీపీని వీడి కాంగ్రెసులో చేరిన నాటకీయ సంఘటనలను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం సంచలన విజయం సాధించి అధికారికం లోకి వచ్చినప్పటికీ అద్దంకి, మార్టూరు నుండి మాత్రం పార్టీ తరపున తెలుగుదేశం అభ్యర్థులు లేకపోవటం విశేషం.
1978 లో అడ్డంకి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరుపున బలరాం రాజకీయరంగప్రవేశం చేసినప్పటి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గంలో ఉండేవాడు. 1978 గెలిచిన బలరాం 1983 లో ఓడిపోయారు. 1985లో టీడీపీ లో చేరి మార్టూరు నుంచి పోటీ గెలిచారు. 1989 లో మార్టూరు నుండి తెలుగుదేశం తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన కరణం బలరాం కు తనమీద నమోదయిన ఒక హత్యకేసులో1993 లో యావజ్జీవ జైలు శిక్ష పడింది. జైలు శిక్ష నుంచి బయటపడటానికి నేదురుమల్లి ద్వారా నాటి ప్రధాని పీవీ నర్సింహా రావ్ సహకారం కోరాడని ప్రత్రికలు రాశాయి. మొత్తానికి 100 రోజుల జైలు శిక్ష తరువాత బెయిల్ మీద బలరాం బయటకొచ్చాడు.
Read Also : కరణం బలరాం వైఎస్సార్‌సీపీలో అధికారికంగా చేరుతారా..?
1994 ఎన్నికల సమయంలో బలరాం పార్టీ మారుతాడని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. బలరాం మాత్రం ఏమి తేల్చకుండా స్తబ్దుగా ఉండిపోయాడు. ఒక సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎన్టీ రామారావు ఎట్టిపరిస్థితుల్లో కరణం బలరాం టిడిపిని వీడరని ప్రకటిస్తుండగానే బలరాం కాంగ్రెస్ నేతలను కలిశాడు . అదే విషయాన్ని విలేఖరులు ఎన్టీఆర్ ను అడగగా “ఏమి చేస్తాం” అన్నట్లుగా నిర్వేదాన్ని ప్రకటించాడు. ఆ ఎన్నికల్లో బలరాం కాంగ్రెస్ తరుపున పోటీచేశారు.
1989లో కరణం బలరాం పై కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి ఒడిపోయిన రాజకీయ ప్రత్యర్థి గొట్టిపాటి హనుమంత రావు ఆ తర్వాత అనూహ్యంగా 1994 ఎన్నికలకు ముందు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. అయితే సమయాభావం, వివిధ సాంకేతిక కారణాల వల్ల తెలుగుదేశం బి ఫారం అందకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి హనుమంతరావు తెలుగుదేశం మద్దతుతో తన చిరకాల ప్రత్యర్థి కారణం బలరాం పై 9 వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో గొట్టిపాటి హనుమంతరావుకి మంత్రి పదవి కూడా దక్కింది.
1994 అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో కూడా ఇదే నాటకీయత చోటుచేసుకుంది. మార్టూరు కాకపోతే అద్దంకి నుంచైనా తెలుగుదేశం తరుపున బలరాం పోటిచేస్తారని మాజీ MLA గరటయ్య భావించారు. అంతేకాక 1989 ఎన్నికల్లో ఓటమి తర్వాత గరటయ్య కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా వున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న గాదె వెంకటరెడ్డి కి గరటయ్య అత్యంత సన్నిహితంగా వున్నారు. ఈ నేపథ్యంలో తనకు తెలుగుదేశం టికెట్ దక్కకపోవచ్చని భావించిన గరటయ్య అద్దంకి నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.
Read Also : బలరాం టార్గెట్ పర్చూరేనా..?
తెలుగుదేశం అద్దంకిలో ఒక ద్వితీయశ్రేణి నాయకుడికి బి-ఫారం ఇచ్చింది. అయితే తెలుగుదేశం అభ్యర్థి తన నామినేషన్ ని ఉపసంహరించుకుంది. తెలుగుదేశం మద్దతు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గరటయ్యకు లాభించింది. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు పై 7 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గరటయ్య గెలుపొందారు. స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందిన గొట్టిపాటి హనుమంతరావు, బాచిన గరటయ్యలను ఇద్దరినీ పార్టీ లోకి ఆహ్వానించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి చేర్చుకున్నారు.
ఇందిర కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన బలరాం ఆ తర్వాత కాంగ్రెస్.. టిడిపి, తిరిగి కాంగ్రెస్ మళ్లీ టీడీపీ లో ప్రయాణం చేశారు. 45 ఏళ్ల రాజకీయం జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బలరాం ఇప్పుడు వైఎస్సార్ సీపీ లో ప్రయాణించబోతున్నారు.