Idream media
Idream media
లోపాలు సరిదిద్దుకోవడానికి విమర్శలు ఉపయోగపడతాయి. ప్రభుత్వం అన్నాక అభినందనలతో పాటు వాటిని కూడా స్వీకరించాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం తీరు అందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ నియంత్రణలోని లోపాలను ఎత్తిచూపుతూ పలువురు నాయకులు చేసిన ట్వీట్లను తొలగిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం.
మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విటర్‌తో పాటు, సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ దాదాపు 100 ట్వీట్లను శనివారం తొలగించింది. దీనిపై ట్విటర్ ఆదివారం వివరణ ఇచ్చింది. ‘‘కొవిడ్‌పై తప్పుడు వార్తలు, పోస్టులను తొలగించాలని మాకు కేంద్ర ఐటీ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటికి సంబంధించిన లింకులను కూడా అధికారులు పంపారు. ఆయా ట్వీట్ల వల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తోందనే హోంశాఖ హెచ్చరికలతో ఐటీ శాఖ మాకు నోటీసులు ఇచ్చింది. ఆ మేరకు మేము ఆయా ట్వీట్లను తొలగించాం’’ అని పేర్కొంది. ఫేస్‌బుక్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విపక్షాల విమర్శలు
ట్విటర్ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ‘‘కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌పై నియంత్రణ కంటే.. కొవిడ్ నియంత్రణపై దృష్టి పెడితే బాగుంటుంది. అవసరార్థులకు సమయానికి ఆక్సిజన్ అందజేసి, ప్రాణాలను నిలబెట్టాలి’’ అని ఎంపీ రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ కూడా కేంద్ర ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తిపోశారు. తొలగించిన ట్వీట్లలో ఏముందో పేర్కొంటూ.. ఆయన కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాస్తవాలను చెబుతూ.. కేంద్రాన్ని విమర్శిస్తే.. అవి తప్పుడు వార్తలా? సినీ నిర్మాత, మాజీ జర్నలిస్టు వినోద్ కాప్రీ ట్వీట్‌లో తప్పుదోవ పట్టించే విషయమేముంది? శ్మశానాల్లో స్థలం దొరికేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సూచించారు. ఆ ట్వీట్‌ను కూడా తొలగించారు’’ అని ఠాకూర్ విమర్శించారు.
అందులో తప్పేముంది…
వినోద్ కాప్రీ కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక సినీ నిర్మాతగా, మాజీ జర్నలిస్టుగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టే బాధ్యత నాపై ఉంది. ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయని ట్వీట్ చేశాను. శ్మశానాల్లో స్థలం దొరకడం లేదని, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరాను. అందులో తప్పేముంది’’ అని ఆయన ప్రశ్నించారు. అయితే.. తనకు నచ్చని పనిని వదంతులు, తప్పుడు వార్తలు అనడం కేంద్ర ప్రభుత్వానికి సాధారణమైపోయిందని.. రైతు ఉద్యమం సమయంలో కూడా రాజకీయ నేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులకు సంబంధించిన 500 ఖాతాలను బ్లాక్ చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇకపై కొవిడ్‌పై నిజాలను పోస్టు చేయాలంటే భయపడాలనే విధంగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శిస్తున్నారు. జర్నలిస్టుల ట్వీట్లను కూడా తొలగించడాన్ని ఆక్షేపిస్తున్నారు. ఇదిలా ఉండగా, విమర్శలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుంది. కానీ, కొవిడ్-19పై తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఉపేక్షించదు అని కేంద్ర ఐటీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కేంద్రం తీరు విస్మయం కలిగిస్తోంది…
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న వేళ బాధ్యతగా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు నిలదీస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. అటువంటి వారిని గుర్తిస్తూ వారి వెంట పడడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కావలసినంత సమయం దొరికిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సర్కారు తీరు విస్మయం కలిగిస్తోందని చెప్పారు.
తొలగించిన కొన్ని ట్వీట్లు
‘‘దేశంలో కరోనా కేసులు రోజుకు 2 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతోంది’’..
– మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ నేత ఎ.రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్ ఇది. ఈ ట్వీట్‌కు జతగా హృదయ విదారకరమైన కొన్ని ఫొటోలను జతచేశారు.
‘‘వారాణసీలో పరిస్థితులు భయానకంగా మారాయి. ఆస్పత్రుల్లో చికిత్స పొందలేని పరిస్థితి. కానీ, రాజకీయ ర్యాలీలకు అడ్డంకుల్లేవు’’..
నటుడు వినీత్‌కుమార్ సింగ్ హిందీలో పెట్టిన ట్వీట్ ఇది.