iDreamPost
iDreamPost
దేశమంతా ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా తెలుగు మీడియాలో కథనాల పరంపర సాగింది. సోషల్ మీడియాలో అయితే చెలరేగిపోయారు. చంద్రబాబు కూడా సీన్ లోకి వచ్చారు. స్వయంగా ఆయనే ఫోన్ చేసి సోనూ సూద్ ని అభినందించారు. కూతుళ్లతో కలిసి దుక్కి దున్నుతున్న విషయం ట్విట్టర్ ద్వారా తెలుసుకుని , తనకు తోచిన సహాయం అందించినందుకు అంతా మెచ్చుకున్నారు. చెప్పినట్టుగానే వెంటనే ట్రాక్టర్ ని రైతు నాగేశ్వర రావు దగ్గరకి చేర్చడం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. అంతవరకూ బాగానే ఉంది..కానీ అసలు ఆ రైతు నాగేశ్వర రావు, ఎందుకు అలా చేశారన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ట్విస్ట్ బయటపడింది. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మహల్ రాజు పల్లె రైతు ఎందుకు మారుమ్రోగిందన్నది గ్రహిస్తే ఆశ్చర్యం వేస్తోంది.
సోనూ సూద్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారు..
చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం ఆశాజనకంగా ఉంది. గత కొన్నేళ్లతో పోలిస్తే తొలిసారిగా భారీ వర్షాలు కురిశాయి. దాంతో రైతులు సాగుకి సన్నద్ధమయ్యారు. ఆ క్రమంలోనే రైతు వీరదల్లు నాగేశ్వరరావు పంట సాగు చేసే క్రమంలో దుక్కి దున్నేందుకు ఇద్దరు ఆడబిడ్డల సహాయం తీసుకున్నాడు. ఎడ్లు లేకపోవడంతో ఇంట్లో ఉన్న కూతుళ్లకు కాడి కట్టి దుక్కితున్నారంటూ ఓ టీవీ చానెల్ విలేకరి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉండే ఆ విలేకరికి దుక్కిదున్నుతున్న విజువల్స్ ఎలా వచ్చాయన్నది ఆసక్తికరమే. అది పక్కన పెడితే ఆ ట్వీట్ వైరల్ గా మారడంతో సోనూ సూద్ వరకూ చేరింది.
Also Read:ఎల్లలు దాటిన దాతృత్వం
ఇటీవల వివిధ సందర్భాల్లో సేవా కార్యక్రమాలతో సోనూ సూద్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆశేషంగా అభిమానులను సంపాదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్వీట్ చూసి వెంటనే వారికి ట్రాక్టర్ ఇస్తానని మాట ఇవ్వడం, సాయంత్రానికి రైతు ఇంటికి ట్రాక్టర్ చేరడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. సోనూ సూద్ మనసు నిజంగానే బంగారం అంటూ కొనియాడారు. ముంబైలో ఉండి చిత్తూరు జిల్లా మారుమూల పల్లెలో రైతు కష్టాన్ని అర్థం చేసుకుని ట్రాక్టర్ అందించడం ద్వారా పెద్ద మనసు చాటుకున్న తీరుకి స్పందన కనిపించింది.
లోక్ సత్తా నాయకుడిగా పోటీ చేసిన నాగేశ్వర రావు..
సోనూ సూద్ సాయం చేసింది ఓ సాధారణ రైతుకి అనే రీతిలో కథనాలు వచ్చాయి. కానీ సదరు రైతు వీరదల్లు నాగేశ్వర రావు ఇప్పటికే వివిధ సంస్థల్లో పనిచేశారు. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. వీరదల్లు నాగేశ్వర రావు గతంలో 2009 ఎన్నికల్లో లోక్ సత్తా తరుపున మదనపల్లి బరిలో దిగి వెయ్యి కి పైగా ఓట్లు కూడా సాధించారు.అంటే సమాజంలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న వ్యక్తిగానే భావించవచ్చు . అలాంటి వ్యక్తి ఎందుకు ఈ ప్రయత్నం చేశారన్నది ఆశ్చర్యకరం. అదే సమయంలో హిందూ పత్రిక కథనంలో స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వారి కుటుంబం స్వచ్ఛందంగా ఓ చిన్న ప్రయత్నంగా ఇలాంటి పనిచేసినట్టు చెబుతున్నారు. పొలం దున్నడానికి ఎడ్లు లేకపోవడం గానీ, ఇతర సమస్యలుండి గానీ అలా చేయలేదని, కొత్త అనుభూతి కోసమే ఇలాంటి పని చేశారని ఆ ఊరి వాసులు చెబుతున్నారు. అయితే నాగేశ్వరరావు కుటుంబం కూడా ఊహించని రీతిలో మలుపు తీసుకుని ఇది సంచలనంగా మారిందని వారు చెబుతున్నారు.
అన్నింటికీ మించి వారు సమీప పట్టణంలో నివాసం ఉంటూ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఉపశమనం కోసం ఊరికి వచ్చినట్టు చెబుతున్నారు. ఏటా వ్యవసాయం చేసే కుటుంబం కాదని కూడా అంటున్నారు. తాత్కాలికంగా గ్రామానికి వచ్చిన వారిని రైతుగా చిత్రీకరించి ప్రచారం చేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెర మీదికి చంద్రబాబు ఎందుకు వచ్చారు…
చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా. అలాంటి చోట్ల నిజంగా రైతుకి సమస్య ఉంటే దానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లాలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలను నాశనం చేయడంలో చంద్రబాబు పాత్ర ఉందనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ముఖ్యంగా హెరిటేజ్ కోసం చిత్తూరు కో ఆపరేటివ్ డెయిరీలన దుంప నాశనం చేశారన్నది సామాన్యులు కూడా చెప్పే విషయం. అలాంటి సమయంలో సొంత జిల్లా రైతు సమస్యకు చంద్రబాబు బాధ్యత ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ ఆయన మాత్రం సోనూ సూద్, రైతు ట్రాక్టర్ ఎపిసోడ్ ని కూడా రాజకీయంగా మలచుకునే ప్రయత్నం చేయడం విస్మయకరంగా మారింది.
నేరుగా సోనూ సూద్ కి ఫోన్ చేసినట్టు చంద్రబాబు ప్రకటించుకున్నారు. వాస్తవానికి ఆ సినీ నటుడు ఉదారంగా స్పందించిన దానికి అభినందించడంలో తప్పు లేదు. కానీ దానిని మీడియాకు చెప్పుకోవడం ద్వారా ప్రచారం ఆశించడమే చంద్రబాబు నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. పైగా ఇప్పటికే ఉన్నత విద్య పూర్తిచేసే దశలో ఉన్న రైతు పిల్లలకు చదువులు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. నిజంగా చిత్తశుద్ది ఉంటే సోనీ సూద్ ఒకరికి ట్రాక్టర్ కొనిస్తే, చంద్రబాబు వందల మందికి కొనుగోలు చేసి అందించవచ్చు. లేదా కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అవసరం అయితే చేసి ఉండవచ్చు. కానీ అవేమీ లేకుండానే ఎంతో పెద్ద మనసు ఉన్న నేతగా చెప్పుకునే క్రమంలో చంద్రబాబు చేసిన రాజకీయాలు , దానికి మీడియా ఇచ్చిన ప్రాధాన్యత గమనిస్తే బాబు అండ్ కో బ్యాచ్ భజన బోధపడుతుంది.
Also Read:అది లేకుండా చంద్రబాబు ఉండలేరు
కేవీ పల్లె మండలానికి చెందిన రైతు నాగేశ్వరావుకి నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాల కోసం తిరిగే అలవాటు కూడా ఉంది. వివిధ సందర్భాల్లో రాజకీయ నేతగా ప్రకటనలు కూడా ఇస్తూ ఉంటారు. అలాంటిది ఆయన విరామం కోసం ఊరికి వచ్చి, బిడ్డలతో కలిసి చిన్న ప్రయత్నం చేయడం , దానిని సంచలనంగా మార్చడం ఆసక్తికరమైన ట్విస్ట్ గా మారింది.