Idream media
Idream media
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలున్నాయి. అదే విధంగా ప్రస్తుత ఏపీ పాలనా రాజధానిలోనూ జంట నగరాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజధానుల ఏర్పాటు రాష్ట్రాల ఇష్టమేనంటూ ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులపై జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పులు, వివాదాల సమస్యలను పరిష్కరించుకుంటూ మూడు రాజధానులపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలనా రాజధాని విశాఖలో చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం చేస్తోంది. తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి దృష్టి పెట్టింది. ఇతర రాష్ట్రాల రాజధానులకు ఏ మాత్రమూ తీసుపోకుండా ఉన్న వనరులను వినియోగించుకుని అదనపు హంగుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నారు.
సరికొత్త ప్రతిపాదనలు
రాజధాని విశాఖతో పాటు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనలతో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలను జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో ఏపీ కొత్త రాజధానికి జంట నగరాల కాన్సెప్ట్ రూపొందిస్తున్నారు. వైసీపీ వర్గాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. ‘‘విశాఖపట్నానికి విజయనగరం జస్ట్ 50 కిలోమీటర్లు. నాన్ స్టాప్ బస్సులో గంట జర్నీ. అందుకే విశాఖ పాలనా రాజధానికావడంతో మళ్లీ విద్యలనగరంగా అభివృద్ధి చెందబోతోంది.
విజయనగరం సరిహద్దుకు ఆనుకునే అభివృద్ధి వస్తుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ లాగా విశాఖ-విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చెందే ఆస్కారము ఉంది. విశాఖ పాలనా రాజధానైతే ఎక్కువగా లబ్ధిపొందేది విజయనగరమే- ఎన్నో శాటిలైట్ టౌన్ షిప్పులు, మెట్రో రైలు వస్తాయి. విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. జగన్ వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టుపై జీఎంఆర్ తో ఒప్పందం కుదిర్చారు. మరో రెండు మూడేళ్లలో అది అందుబాటులోకి రానుంది. అశోక్ గజపతి ఇంటిపక్కనే ఉన్న ఈస్ట్ కోస్ట్ , అరుణ జ్యూట్ మిల్లుల్ని వైసీపీ సర్కారు పున:ప్రారంభిస్తుంది. శ్రీపైడితల్లి , రామతీర్థం ఆలయాలను అభివృద్ధి చేస్తుంది. రీస్టార్ట్ ప్యాకేజ్ కింద విజయనగరంలో 105 చిన్న మధ్యతరహ పరిశ్రమలకు ప్యాకేజ్ అందడంతో తిరిగి తెరుచుకున్నాయి. పంచనదుల జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని జిల్లాను సస్యశామలం చేయబోతున్నది” అని ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విశాఖ, విజయనగరం జంట నగరాలుగా ఉండొచ్చని గతంలో సూచన ప్రాయంగా చెప్పారు.