iDreamPost
android-app
ios-app

రవి ప్రకాష్ రీ ఎంట్రీ కన్ఫర్మ్, ఈసారి డిజిటల్ ఛానల్ తో

  • Published Jan 28, 2022 | 1:44 AM Updated Updated Jan 28, 2022 | 1:44 AM
రవి ప్రకాష్ రీ ఎంట్రీ కన్ఫర్మ్, ఈసారి డిజిటల్ ఛానల్ తో

టీవీ9 వ్యవస్థాపకుల్లో ఒకరిగా రవి ప్రకాష్ కి గుర్తింపు ఉంది. అయితే ఆ తర్వాత ఆయన వ్యవహారశైలి మూలంగా అనేక సమస్యలు కొనితెచ్చుకున్నారు. చివరకు తన సొంత సంస్థగా భావించిన చోటు నుంచి గెంటివేయబడ్డారు. అదే సమయంలో చివరకు వివాదాలతో జైలుపాలు కావాల్సి వచ్చింది.

అన్నీ సర్దుకుని మళ్లీ మీడియాలో అడుగుపెట్టాలని ఆనాటి నుంచి ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ ఫలితాలు రావడం లేదు. కొంతకాలం రాజ్ న్యూస్ పేరుతో బీజేపీ గొంతు వినిపించడానికి సైతం ఈ ప్రగతిశీల వాది ప్రయత్నించినా ఫ్రభావం చూపలేకపోయారు. దాంతో అక్కడి నుంచి కూడా విరమించుకున్నారు. తొలివెలుగు వంటి వెబ్ సైట్ ద్వారా అప్పుడప్పుడూ కలకలం రేపుతున్నా ఆశించిన స్థాయికి రవి ప్రకాష్ బృందం చేరుకోలేకపోతోంది. ఆయన నేతృత్వంలో టీవీ9 సంచలనమయితే తదుపరి పరిణామాల్లో రవి ప్రకాష్ అంతంతమాత్రమే అన్నట్టుగా మారిపోయింది.

అయితే పట్టుదలతో పదే పదే ప్రయత్నాలు చేస్తున్న రవి ప్రకాష్‌ మరో అడుగు వేశారు. ఈసారి డిజిటల్ రంగంలో తన ముద్ర వేసుకోవాలని తపన పడుతున్నారు. దానికి తగ్గట్టుగా రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరిలో దానికి ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే రీతిలో గతంలో కొన్ని లీకులిచ్చినా అవన్నీ ఫలించలేదు. ఈసారి రవి ప్రకాష్‌ ముమ్మరయత్నాలు ఏమేరకు ఆచరణలోకి వస్తాయో చూడాల్సి ఉంది. టీవీ9 వ్యవస్థాపనకు అసోసియేటెడ్ మీడియా పేరుతో శ్రీనిరాజు అండదండలు అందించినట్టే ఈసారి మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్ తో పాటు సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ సంస్థల తోడ్పాటుతో రవిప్రకాశ్ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.

రవి ప్రకాష్‌ అండ్ కో ఇప్పటికే పలు యూట్యూబ్ చానెళ్లను కొనుగోలు చేశారు. ఐదారు చానెళ్లు చేతుల్లోకి తీసుకున్నారు. వాటి కోసం పెద్దమొత్తమే వెచ్చించినట్టు చెబుతున్నారు. ఆర్థికంగా రవి ప్రకాష్‌ బాగా స్థిరపడ్డారనే పలువురు భావిస్తున్న తరుణంలో ఇది పెద్ద వ్యవహారం కాదనే భావించాలి. అయితే తాజా ప్రయత్నాలు కేవలం డిజిటల్ కే పరిమితమవుతాయా లేక మరో అడుగు వేస్తారా అనేది కూడా ఆసక్తికరం.

ప్రస్తుతానికి డిజిటల్ మీడియాతో ప్రయత్నించి భవిష్యత్తులో దానికి అనుగుణంగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ చోట్ల ఉన్న రవి ప్రకాష్ ఒకనాటి సహచరులందరినీ తన దరికి చేర్చుకునే యత్నాల్లో ఉన్నారు. సీనియర్లు, తెలుగు న్యూస్ చానెళ్లలో చిరపరిచితులను సమీకరించడం ద్వారా సత్తా చాటాలని చూస్తున్న రవి ప్రకాష్‌ సంకల్పం ఏమేరకు నెరవేరుతుందో చూడాలి.

వాస్తవానికి తెలుగు డిజిటల్ మీడియాలో న్యూస్ విభాగానికి పెద్ద పోటీ ఉంది. ఇప్పటికే పలు సంస్థలు పాగా వేశాయి. అయినా కొత్తదనానికి అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. భిన్నంగా ప్రయత్నిస్తే ప్రేక్షకులకు చేరువ కావడంలో అనుమానాలు అవసరం లేదు. అయితే ఆ ప్రయత్నాల్లో ఏమేరకు విజయవంతమవుతారన్న దానిని బట్టి రవి ప్రకాష్‌ రీ ఎంట్రీ ఆధారపడి ఉంటుంది.

అయితే ఇప్పటికే మార్కెట్లో రవి ప్రకాష్‌ వ్యతిరేకులు కూడా అనేక మంది ఉన్న తరుణంలో ఎదురయ్యే సమస్యలు కూడా అనివార్యం. పోటీ మార్కెట్లో పుంజుకోవడానికి వేసే ఎత్తుల్లో చివరకు ఎటు మళ్లుతాయన్నది కూడా ఆసక్తికరం. ఏమైనా ఒకనాటి తెలుగు న్యూస్ మీడియాలో తిరుగులేని స్థానానికి చేరుకుని అంతలోనే కనుమరుగైన రవి ప్రకాష్‌ మళ్లీ ప్రత్యక్షం కావాలని చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించదగ్గవే.