iDreamPost
iDreamPost
ఏపీలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి కొడుకు అదే పీఠంపై కూర్చున్న ఘనతను వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలోనే అనేక అరుదైన పరిణామాలకు ఆయన సాక్షీభూతం అవుతున్నారు. తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడం, పథకాలను కొత్త పుంతలు తొక్కించడం వంటి అనేక ప్రయత్నాల్లో జగన్ తలమునకలై ఉన్నారు. దానికి కొనసాగింపుగా తుంగభద్ర పుష్కరాల్లో మరో ఘనతను సొంతం చేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి మాత్రమే సాధ్యమయిన అరుదైన విషయంగా ఇది పుష్కరాల చరిత్రలో నిలిచిపోతుంది.
ఏటా ఏదో నదికి పుష్కరాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అదే క్రమంలో ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. వాటిని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ స్వయంగా ప్రారంభించడం విశేషం. ఈ నదికి గత పుష్కరాలు 2008 డిసెంబర్ 10 నుంచి జరిగాయి. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డిసెంబర్ 11న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. నదీ హారతి కార్యక్రమంలో నాటి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఇక ప్రస్తుతం సీఎం జగన్ కూడా అదే సంకల్ భాగ్ ఘాట్ లో ప్రస్తుత పుష్కరాలు ప్రారంభిస్తున్నారు. ఒకే నదికి వరుసగా రెండు పుష్కరాలను ఒకే కుటుంబానికి చెందిన ముఖ్యమంత్రులు ప్రారంభించడం అరుదైన ఘటనగా చెబుతున్నారు. దేశంలోనే అన్ని ప్రధాన నదుల పుష్కరాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదంటున్నారు. తండ్రీ, తనయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రెండు వరుస పుష్కరాలు జరగడం, వారు అందులో పాల్గొనడం ప్రత్యేకతగా భావిస్తున్నారు.