Idream media
Idream media
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి దాదాపుగా ఏడాది నుంచి అనేక పుకార్లు మీడియాలో హల్ చల్ చేస్తూ వచ్చాయి. తుమ్మల నాగేశ్వరరావు 2018 తర్వాత పెద్దగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడటం గానీ పెద్దగా చేసిన సందర్భం ఎక్కడా లేదనే చెప్పాలి. 2018 తర్వాత సీఎం కేసీఆర్ ఆయనను పట్టించుకున్నట్టు కూడా పెద్దగా కనబడలేదు.
2020 తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరిగినా సరే అది నిజం కాదని తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కే అవకాశం ఉందని భావించిన సరే టిఆర్ఎస్ పార్టీ అగ్రనేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కి సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఆయనతో చర్చలు జరుపుతున్నారని, అలాగే తెలుగుదేశం పార్టీలో ఆయనతో సన్నిహితంగా ఉన్న గరికపాటి మోహన్ రావు బీజేపీ లోకి రావాలని ఆహ్వానించారని ప్రచారం జరిగింది.
అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అడిగారని, అయినా సరే తుమ్మల నాగేశ్వరరావు ఏ విషయం స్పష్టంగా చెప్పలేదు అని ఎవరి ప్రచారం వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ మరోసారి పరోక్షంగా షాకిచ్చారు. తన మాజీ మంత్రివర్గ సహచరుడు కడియం శ్రీహరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన, సీఎం కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా ఆరు స్థానాలకు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి కోటిరెడ్డి అలాగే రవీందర్రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కడియం శ్రీహరి అలాగే మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్లను ఖరారు చేసిన సీఎం కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు పేరు గురించి ఆలోచించలేదు. దీంతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు దాదాపుగా ముగిసిపోయింది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
2018 లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ కు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఆయనకు పరోక్షంగా వామ పక్షాల నుంచి కూడా సహకారం నేపథ్యంలో పువ్వాడ అజయ్ కుమార్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ కాస్త ప్రోత్సహిస్తున్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలో కూడా పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాకు ఎక్కువగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాలను వేగవంతం చేశారు.
గతంలో తుమ్మల నాగేశ్వర రావుకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ఘనత ఎక్కువగా ఉండేది. అయితే పువ్వాడ అజయ్ కుమార్ వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు పేరు అసలు ప్రస్తావన లోకి కూడా రావడం లేదు. ఇక తుమ్మల నాగేశ్వర రావు వర్గం కూడా పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించటం, కొన్ని నియోజకవర్గాల్లో కనీసం తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు కూడా లేకపోవడం ఇప్పుడు ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు శకం దాదాపుగా ముగిసిందని ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే ఏమైనా మార్పులు జరగవచ్చు అని ప్రస్తుతానికి టిఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రం తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు దాదాపుగా అయిపోయినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.