iDreamPost
android-app
ios-app

రివర్స్ వలస- తెరాస నుంచి బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్

రివర్స్ వలస- తెరాస నుంచి బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఆధిపత్యం నిత్యం కొనసాగుతూనే ఉంటోంది. ఇరు పార్టీలూ ఆయా ప్రాంతాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌లోకి భారీ స్థాయిలో బీజేపీ శ్రేణులు వస్తుంటే.. కొన్నిచోట్ల బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ నేతలు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నగర శివార్లలో మంత్రి సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కీలకమైన తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌ను తమ వైపు తిప్పుకుంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పరిణామం జరగడం గమనార్హం.

మధుమోహన్‌ బీజేపీలోకి వెళ్లకుండా మంత్రి సబితారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను బుధవారం ఢిల్లీలో కలిసిన మధుమోహన్‌ కాషాయం కండువా కప్పుకున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవకపోయినా, ఎక్స్‌అఫిషియో ఓట్ల సాయంతో మధుమోహన్‌కు చైర్మన్‌ పదవి కట్టబెట్టిన టీఆర్‌ఎస్‌కు ఇది పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన తుక్కుగూడ మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 వార్డులకు గాను 9 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌కు 5 వార్డులు మాత్రమే దక్కాయి. బీజేపీ టిక్కెట్‌ ఆశించి భంగపడిన మధుమోహన్‌ 2వ వార్డులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు.బీజేపీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ మంత్రి సబితారెడ్డి పావులు కదిపారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన బీజేపీ రెబల్‌ అభ్యర్థి మధుమోహన్‌కు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. తరువాత ఎక్స్‌అఫిషియో ఓట్లతో మధుమోహన్‌ను చైర్మన్‌ చేశారు. దీంతో తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. 

అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మధుమోహన్‌కు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు విభేదాలు పెరిగాయి. మంత్రి సబితారెడ్డితో కూడా ఆయనకు సఖ్యత కుదరలేదు. ఇది గమనించిన బీజేపీ నేతలు సమయం చూసి చక్రం తిప్పారు. మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, బీజేపీ నేత అందే శ్రీరాములు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ పెద్దల సహకారంతో చర్చలు జరిపి మధుమోహన్‌ను తమవైపు తిప్పుకున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి సబితారెడ్డి బుజ్జగించే యత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మధుమోహన్‌ను ఆగమేఘాల మీద ఢిల్లీకి తీసుకెళ్లిన బీజేపీ నేతలు ఆయనకు కాషాయం కండువా కప్పి టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు మంత్రి సబితారెడ్డికి షాక్‌ ఇచ్చారు.

Also Read : ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్ నోటీస్.. రాజ్యాంగ ఉల్లంఘనేనట?