iDreamPost
android-app
ios-app

శ్రీవారి దర్శనానికి కష్టాలు తొలగనున్నాయ్‌

శ్రీవారి దర్శనానికి కష్టాలు తొలగనున్నాయ్‌

కోవిడ్‌ వైరస్‌ మహమ్మారికి ప్రభావితం కాని మానవులు ఎవరూలేరు. మనుషులే కాదు.. వైరస్‌ ప్రభావం దేవదేవుళ్లపై కూడా పడింది. వైరస్‌ ధాటికి ఎన్నడూ మూతపడని ఆలయాలు సైతం మూసేయాల్సి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి కూడా కరోనా వైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైంది. లాక్‌డౌన్‌ సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. భక్తులులేకుండా స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఆ సమయంలో శ్రీవారి భక్తులు స్వామి దర్శనం చేసుకోలేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. లాక్‌డౌన్‌ తర్వాత స్వల్ప సంఖ్యలో భక్తులను అనుమతించడం ప్రారంభించారు. ప్రారంభంలో రోజుకు ఆరుపలకవేల మందికి దర్శనం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆ తర్వాత క్రమంగా ఆ సంఖ్య పెంచింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవడం ద్వారా మాత్రమే స్వామి వారి దర్శనం కలుగుతోంది.

కోవిడ్‌ మూడో వేవ్‌ కూడా తగ్గుముఖం పట్టడం, వైరస్‌ మరింత బలహీనం కావడం వంటి పరిస్థితుల్లో స్వామి వారి దర్శనం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్‌ చేసుకుంటుండగా.. ఇకపై ఆఫ్‌లైన్‌లోనూ స్వామి వారి సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రోజుకు 10 వేల టిక్కెట్లు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు టీటీడీ జేఈవో జవహర్‌ రెడ్డి వెల్లడించారు. దీనితోపాటు ఉదయస్తమాన సేవ టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకమైన యాప్‌ సిద్ధం చేశామని చెప్పారు. ఆ యాప్‌ 16వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

కోవిడ్‌ నేపథ్యంలో స్వామి వారి ఆర్జిత సేవలకు భక్తులను దూరంగా ఉంచారు. పరిస్థితులు మళ్లీ చక్కబడుతుండడంతో స్వామివారి అన్ని సేవలకు భక్తులను అనుమతించాలని టీటీడీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే విషయంపై కూడా చర్చిస్తోంది. ఈ నెల 17వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేఈవో జవహర్‌ రెడ్డి కూడా ఈ విషయంపై మాట్లాడడంతో.. స్వామివారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించడం దాదాపు లాంఛనమే కావచ్చు. మొత్తంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మళ్లీ మునుపటి మాదిరిగానే లభించనుండడం సామాన్య భక్తులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.

Also Read : సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం: పేర్ని నాని