Idream media
Idream media
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పదో తరగతి పరీక్షపైనా పడింది.కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో మొదటినుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.అత్యున్నత శానిటేషన్ పద్ధతులు పరీక్షా కేంద్రాలలో అమలు చేసి పరీక్షల నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. కానీ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 కు చేరిన పరిస్థితులలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.శుక్రవారము పిల్ పై అత్యవసర విచారణ హైకోర్టు చేపట్టింది. ప్రపంచాన్ని భయపెడుతూ వేల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడం సమంజసం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు.దేశంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. శనివారం నాటి హిందీ పరీక్షను యధావిధిగా నిర్వహించి సోమవారం మార్చి 23 నుంచి మార్చి30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.అధికారులతో ఈనెల 29న అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి కరోనా కట్టడిని అంచనావేసి ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.కరోనా వైరస్ ప్రబలకుండా పరీక్షా కేంద్రాలను నిరంతరము శానిటైజ్ చేస్తూ పదో తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా విద్యా సంస్థల అన్నిటికీ మార్చి 16 నుండి మార్చి 31 వరకు కెసిఆర్ సర్కార్ సెలవులు ప్రకటించింది.