Idream media
Idream media
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్రం ఆపసోపాలు పడుతుంటే.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం నల్లేరు మీద నడకలా మారింది. విదేశాల నుంచి వచ్చిన భారతీయులకే కరోనా పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తిరిగి వచ్చిన వారిని గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్ష చేసి.. పాజిటివ్ ఉన్నా, లేకపోయినా వారిని కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచితే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియను నిరంతరం చేస్తున్నాయి.
విదేశాల నుంచి వచ్చిన మన భారతీయులు తెలంగాణలో 20 వేల మంది ఉంటే.. ఏపీలో 6,379 మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే 9 వేల మందిని గుర్తించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంటే ఇంకా 11 వేల మంది ఉన్నారు. వీరిని గుర్తించడం తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతోంది. పోలీసు శాఖను ఈ పనికి ఉపయోగించుకుంటోంది. దాదాపు 70 వేల మంది పోలీసులు తమ తమ స్టేషన్ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరిని గుర్తించి పరీక్షలు చేసేలోపు వైరస్ వ్యాప్తి ఏ స్థాయికి చేరుకుంటుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
తెలంగాణతోనే కాదు దేశంలోని ఇతర ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా.. కరోనా వైరస్ నియంత్రణలో ఏపీ ముందంజలో ఉంది. దీనికి కారణం విదేశాల నుంచి వచ్చిన వారిని వేగంగా గుర్తించగలగడమే ఏపీ ప్రభుత్వం చేపట్టిన కీలకమైన ప్రక్రియ. ఏ రాష్ట్రానికి సాధ్యం కానిది ఏపీలోనే సాధ్యమైందంటే దానికి కారణం గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రాష్ట్రంలో 2.80 లక్షల మంది వాలంటీర్లు, 1.18 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించింది. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, పట్టణాలల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించింది. ఏ సమాచారమైనా, సర్వే అయినా సరే ఉదయం అనుకుంటే.. సాయంత్రానికి ప్రభుత్వం వద్దకు చేరుతోంది.
ఏపీలో మొత్తం 1.43 కోట్ల కుటుంబాలు ఉంటే ఇప్పటికే 1.37 కోట్ల కుటుంబాల వద్దకు వాలంటీర్లు వెళ్లారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా..? ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా.? అనే సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు విదేశాల నుంచి 6 వేల మంది వచ్చినట్లు వాలంటీర్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం 6,378 మంది వచ్చారని చెప్పాగా.. వాలంటీర్లు ఆరు వేల మందిని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లేఖకు, రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసం 378 మంది ఉన్నారు. ఇంకా 6 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కావాల్సి ఉండగా.. ఈ 378 మందిని కూడా ఈరోజో, రేపో గుర్తించే అవకాశం ఉంది. వీరందరిని ప్రభుత్వం వారి ఇళ్లలోనే స్వియ నిర్భందంలో ఉంచింది.
ఈ రోజు శనివారం నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసలు సంఖ్య మూడుగా నమోదైంది. గత మూడు రోజులుగా ఈ సంఖ్య పెరగకపోవడం గమనార్హం. మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉంటే.. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.