iDreamPost

ఘోర ప్రమాదం.. అదుపుతప్పి పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఘోర ప్రమాదం.. అదుపుతప్పి పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అనుకోకుండా జరిగే ప్రమాదాలు తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పంట పొలాల్లోకి పల్టీ కొట్టింది. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగి ఉలికిపడ్డారు. భయంతో ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ అప్పుడప్పుడు చోటుచేసుకునే ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో టీఎస్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి పల్టీ కొట్టింది. బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులను ఎక్కించుకుని తొర్రూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు బొడ్డుగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో చెవుల చిన్న పాఠశాలకు చెందిన చుక్క యాకమ్మ, బీబీనగర్ మండలానికి చెందిన కొండ రాములు మృతి చెందారు. కాగా కొండ రాములు కోటమర్తి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీశారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి