iDreamPost
android-app
ios-app

ఈటలకు తొలి విజయం

ఈటలకు తొలి విజయం

ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తాన్న మజీ మంత్రి ఈటల రాజేందర్‌కు తొలి విజయం దక్కింది. తన భార్య జమున పేరున ఉన్న జమున హేచరీస్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ఈటలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కబ్జా ఆరోపణలను నిర్థారిస్తూ మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి సరైన విధానంలో సర్వే చేయాలని స్పష్టం చేసింది.

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో అసైన్మెంట్‌ భూములను ఈటల రాజేందర్‌ కబ్జా చేశారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో విచారణ చేయించి నివేదిక ఇవ్వాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసిన కలెక్టర్‌.. 66 ఎకరాల అసైన్మెంట్‌ భూమిని ఈటల రాజేందర్‌ ఆక్రమించారని ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై స్పందించిన ఈటల రాజేందర్‌.. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌ తనకు నోటీసులు ఇవ్వకుండానే విచారణ చేశారని, కనీస అవగాహన లేకుండా.. జమున వైఫ్‌ ఆఫ్‌ నితిన్‌ అంటూ సంబోధించారని మండిపడ్డారు. అధికారులకు వావివరసలు కూడా తెలియవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్, ఏసీబీ.. ఇతర ఏ అధికారులైనా కేసీఆర్‌ చెప్పిన విధంగా నివేదిక ఇస్తారని.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే శిక్షకు సిద్ధమన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

చెప్పినట్లుగానే ఈటల రాజేందర్‌ ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఇరు వైపు వాదనలను ఆలకించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, విచారణ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండానే విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఓవర్‌నైట్‌ విచారణ పూర్తి చేశారా..? అంటూ ఎద్దేవా చేసింది. ఈ సమయంలో కల్పించుకున్న ఏజీ.. ఆరోపణలు ఎదుర్కొన్నది మంత్రి అంటూ చెప్పబోయారు. ఎవరైనా సరే నిబంధనల ప్రచారం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించింది.

విచారణ ఎలా చేయాలో కూడా కోర్టు డైరెక్షన్‌ ఇచ్చింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం వివరణ ఇవ్వాలనేలా వ్యవహరించకూడదని ఆదేశించింది. వెనుక గేట్‌ నుంచి కాకుండా రాచమార్గంలో విచారణ చేయాలని చురక అంటించింది. ఈ నెల 1,2 తేదీల్లో చేసిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : ఈటలకు మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌