విద్యార్థులకు అలర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో భారీ మార్పులు!

విద్యార్థులకు అలర్ట్‌.. ప్రభుత్వం పాఠశాలల టైమింగ్స్‌ మార్చే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ప్రైవేట్‌ స్కూల్‌ టైమింగ్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పిల్లలు బడి బాట పడితే.. ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం 5-6 అవుతుంది. ఇంటికి వచ్చాక హోం వర్క్‌, ట్యూషన్‌, ఆ తర్వాత నిద్ర.. మళ్లీ లేవడం స్కూల్‌కు వెళ్లడం ఇదే వారి దినచర్యగా మారుతోంది. ఆడుకునే సమయం ఉండటం లేదని మానసిక విశ్లేషుకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలల టైమింగ్స్‌ మార్చే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్కూల్ టైమింగ్స్‌లో మార్పు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్నాయి. హైస్కూల్స్ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు తెరి ఉంటున్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం కొంత సమయం ముందుగానే పాఠశాలలు ప్రారంభం అవుతాయి. అయితే ప్రైమరీ స్కూల్స్‌లో చదివేది చిన్న పిల్లలు కనుక వారు ఉదయం త్వరగా నిద్రలేవరని.. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు స్కూల్స్ ఓపెన్ చేయాలని పలువురు విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు.

హైస్కూల్స్‌లో చదివేది పెద్ద పిల్లలు కనుక వారికి ఉదయం 9 గంటలకే స్కూల్స్ ప్రారంభం కావాలని సూచించారు. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా స్కూల్ టైమింగ్స్ ఉన్నాయని.. అందుకే వాటిల్లో మార్పులు చేయాలని పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రైమరీ, హైస్కూల్‌ అనే తేడా లేకుండా అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, నిపుణుల అభ్యర్థన మేరకు సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యయనం తర్వాత స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Show comments