Idream media
Idream media
తెలంగాణలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖకు ప్రస్తుతం మంత్రి లేరు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు రోజూ ఏదో ఆస్పత్రిని సందర్శించే వారు. నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వహించే వారు. ఆస్పత్రులను సందర్శించి రోగులకు ధైర్యం చెప్పేవారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ ను బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఒకటి, రెండు సార్లు సమావేశాలు మినహా కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగలేదు. సీఎస్ సోమేశ్ కుమార్ ఆస్పత్రులను సందర్శించేవారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ ఆరోగ్య శాఖకు మంత్రిగా సోమేశే వ్యవహరిస్తున్నారన్న భావన ఉండేది. ఓ వైపు తెలంగాణ లో కేసుల సంఖ్య పెరుగుతుండడం, సర్కారు తీరు సరిగ్గా లేదన్న విమర్శల నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రిని సందర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ వార్డులను స్వయంగా పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారి గాంధీ ఆస్పత్రికి వచ్చారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీష్ రావు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతులపై ముఖ్యమంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అలాగే పేషెంట్లతో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం కేసీఆర్ పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు.
కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ పర్యటనపై మాజీ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రం సంధించారు. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై బీజేపీ డిమాండ్‌కు కేసీఆర్ దిగొచ్చారన్నారు. గత 15 నెలల నుంచి కరోనాతో బాధపడి దవాఖానా బిల్లులు చెల్లించిన అందరికీ ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్‌మెంట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సుమారు 5 లక్షల పైన డోసుల నిల్వ లెక్కకు సరి తేలాలని, . లేదంటే ఇది టీఆర్ఎస్ బ్లాక్ మార్కెట్ కుంభకోణం అని అనుకోవాల్సి వస్తుంది అంటూ విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.