Idream media
Idream media
యాసంగిలో ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కోనుగోలు చేయనంటేనే.. రైతులను వరి వేయొద్దని చెప్పామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్లు, పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రస్తుతం 1.70 కోట్ల టన్నుల ధాన్యం మార్కెట్లకు వస్తోందని, దీన్ని కొనుగోలు చేసే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని కేసీఆర్ చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని కేసీఆర్ వెల్లడించారు.
కేంద్రం కొనుగోలు చేయకుండా.. రాష్ట్రం ధాన్యం సేకరించలేదని చెప్పారు. యాసంగిలో పల్లికాయ, నువ్వులు తదితర పది రకాల పంటలను సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఏడేళ్లుగా రైతులు ఆగం కాకుండా కాపాడుకుంటూ వచ్చామని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదన్నారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకువస్తే.. వేయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చెప్పారు.
పెట్రోల్ 77 రూపాయలకు ఇవ్వొచ్చు..
పెట్రోల్ ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచేస్తోందని, అదే సమయంలో రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో 2014లో క్రూడ్ ఆయిల్ ధర 105 రూపాయలు ఉందని, ఏడేళ్లలో ఈ ధర పెరగలేదన్నారు. కానీ ధరలు పెరిగాయని అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లు ఉందన్నారు. కానీ పెట్రోల్ ధరలు 110 రూపాయలపైన ఉందన్నారు. పెట్రోల్‌పై ట్యాక్స్ వేస్తే అందులో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని, సెస్ రూపంలో మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రం వ్యాట్‌ను ఏ మాత్రం పెంచలేదని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఓడిపోవడం, రేపు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కంటితుడుపు చర్యగా ఇప్పుడు తగ్గించారని కేసీఆర్ విమర్శించారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే.. పెంచిన సెస్ మొత్తం రద్దు చేయాలన్నారు. అది చేస్తే పెట్రోల్ లీటర్ 77 రూపాయలకే వస్తుందని పేర్కొన్నారు. తాము పెట్రోల్ ధరలు పెంచలేదని, అలాంటిది తగ్గించమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు…
ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసిందన్నారు కేసీఆర్. నేపాల్, బంగ్లాదేశ్ కన్నా జీడీపీ పడిపోయిందన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం ౖచెనా, పాకిస్తాన్‌ను చూపెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా గ్రామాలు నిర్మిస్తోంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం చేతగాని తనం వల్ల దేశాన్ని నాశనం చేసిందన్నారు. కోవిడ్ సమయంలో గంగానదిలో శవాలు తేలాయన్నారు. బీజేపీ వచ్చినప్పుడు 30 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు లక్ష 30 వేల కోట్ల రూపాయలు ఉందన్నారు. ఈ డబ్బు అంతా ఏం చేశారని ప్రశ్నించారు. ధరలు పెరిగాయని, దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం కావడంతో కేంద్రంతో లొల్లి ఎందుకని ఊరుకున్నామని, రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తామంటే కొట్లాడతామన్నారు.
ఇక కొట్లాడతాం..
రైతులను తీసుకెళ్లి కార్పొరేట్ చేతుల్లో పెట్టే నల్ల చట్టాలను రద్దు చేయాలని ఇకపై పోరాటం చేస్తామని కేసీఆర్ చెప్పారు. రైతులకు పూర్తి మద్ధతు తెలుపుతున్నామని ప్రకటించారు. రైతులపై కార్లు ఎక్కించి చంపి.. మళ్లీ కేంద్ర మంత్రులు పోయి రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని పార్లమెంట్‌లో పోరాడతామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలని తనతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అందరం వెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని పోరాటాలు చేస్తామని తెలిపారు.
బండి సంజయ్‌పై ఫైర్…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మెడలు వంచుతా, జైల్లో పెట్టిస్తానంటూ చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి జరిగితే కేసులు పెట్టండని కేసీఆర్ సవాల్ చేశారు. తాము విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మెడలు వంచుతారా..? అని ప్రశ్నించారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే.. ఇకపై ప్రజల ముందు నిలబెడతామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాలుక చీరేస్తానన్నారు. దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. తనను జైల్లో పెట్టిస్తే.. బతికి బట్టగడతావా..? అంటూ బండి సంజయ్‌ను హెచ్చరించారు.
ట్రిబ్యూనల్ ఏర్పాటుకు ఏడేళ్లా..?
నదీ జిలాలపై కూడా కేసీఆర్ మాట్లాడారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు దొంగ డ్రామాలన్నారు. నీటి విషయంపై మాట్లాడితే.. సుప్రింలో కేసు వేశారని కేంద్రమంత్రి మాట్లాడారన్నారు. ఇప్పుడు కేసును ఉపసంహరించుకున్నామని, దమ్ముంటే నీటి వాటాను తేల్చాలన్నారు. ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసేందుకు ఏడేళ్లు పట్టిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొత్త రాష్ట్రం తెలంగాణకు నీళ్లు అవసరం లేదా..? అని ప్రశ్నించారు.