iDreamPost
iDreamPost
కిట్ట బా.. కిట్టయ్య బావా.. అంటూ హడావిడి పడుతూ వచ్చాడు మణి. వస్తూనే బావా ట్రంప్ గొప్పోడా, మోడీ గొప్పోడా అంటూ కూర్చోకుండానే అడిగేసి కుర్చీవెతుక్కోవడం మొదలెట్టాడు.
అందేట్రా మణీ ఆల్రెడీ అధికారంలో ఉన్న మోడీతో, ఓటమికి సిద్దంగా ఉన్న ట్రంప్‌ను పోలుస్తున్నావేంట్రా.. అన్నాడు కిట్టయ్య.
అదేం లేదు బావా ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న డౌటు వచ్చింది. వ్యక్తిగతంగా కాదు బావో పాలనలో ఎవరు గొప్పగా చేసారు? అన్నదే నా డౌటు అంటూ చెప్పుకొచ్చాడు.
అది చెబుతాను సరేగానీ.. ముందు నీకా డౌటు ఎందుకొచ్చిందో చెప్పు అంటూ ఆరాతీసాడు కిట్టయ్య.
అదేం లేదుబావా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కరోని ట్రంప్ సరిగ్గా ఎదుర్కొలేకపోయాడు.. అందుకే ఓటమి పాలయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడట. అలాగే మోడీ వీరోచితంగా ఎదుర్కొన్నాడని కూడా చెప్పాడట.
అరే ఇలా చెప్పారేంటి అని ఓ సారి వెనక్కి ఆలోచించా.. ప్రపంచం మొత్తం మీద అత్యధిక పాజిటివ్‌లు నమోదైన వాటిలో మన దేశం రెండవది, ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్డౌన్‌ను ప్రకటించడం, లాక్డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు నానా ఇబ్బందులు పడడం, ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రత్యక్ష చర్యలు లేకపోవడం, జీఎస్టీ బకాయిలపై చేతులెత్తేయడం.. ఇలా ఆలోచిస్తూ వెనక్కి వెళితే చాలానే తట్టాయి.
వీటిలో అంత గొప్పగా మోడీ ఏం చేసారా? అన్న డౌటు వచ్చింది. అందుకే మోడీ గొప్పా, ట్రంప్ గొప్పా అన్న అనుమానంతో నిన్ను అడుగుతున్నాను. చెప్పు బావా అన్నాడు మణి.
ఎవరు గొప్పోచెప్పడానికేముందిరా.. ఎవరి దేశానికి వాళ్ళు గొప్ప. ఎవరికెక్కువ భజన బృందాలు ఉంటే ఇప్పుడున్న సోషల్ మీడియా శకంలో వాళ్ళే గొప్పోళ్ళయిపోవచ్చును కూడాను.
కానీ ప్రజలున్నారే.. వాళ్ళకన్నీ తెలుసు కదరా. ఎవరు చేసారు? ఎవరు చెయ్యలేదు? ఎవరు నటించారు? ఎవరు దేవుడిమీద భారం వేసారు?.. ఎవరు మనల్ని కాపాడు? ఇలా ప్రతి ప్రశ్నకు ప్రజల దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఇప్పుడు అమెరికా ప్రజలు సమాధానం చెప్పారు. రేపు భారతదేశ ప్రజలు కూడా చెప్పొచ్చు. ఈ లోపు ఎవరు గొప్ప అన్నది మనం తేల్చడం ఎందుకురా? అంటూ అక్కడ్నుంచి లేచాడు కిట్టయ్య.