Idream media
Idream media
ఎంసీహెచ్, జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే సరికొత్త అధ్యయనానికి తాజా పాలకమండలి నాంది పలికింది. సరికొత్త అధ్యయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా ఇద్దరూ మహిళలే ఉండడం ఇప్పటి వరకూ జరగలేదు. 2021 పాలక మండలి ఆ ప్రత్యేకత సాధించింది. మేయర్ స్థానం మహిళకు రిజర్వ్ కావడం తెలిసిందే. డిప్యూటీ మేయర్ జనరల్ కావడంతో ఎవరినైనా నిలబెట్టొచ్చు. దీంతో ఆ పదవిని పురుషుడికి ఇస్తారని అంతా భావించారు. కానీ రెండూ మహిళలకే కేటాయించి కొత్త చరిత్ర సృష్టించారు. తొలిసారిగా స్వరాష్ట్రంలోనే మేయర్‌గా గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నికయ్యారు. చట్ట ప్రకారం 50 శాతం 150 డివిజన్లలో 75 సీట్లు మహిళా కేటగిరిలో రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. అంతకంటే ఎక్కువ మందే మహిళా కార్పొరేటర్లు పాలకమండలిలో అడుగుపెట్టారు. జీహెచ్‌ఎంసీ (2016 – 21) పాలకమండలిలో 78 మంది మహిళా కార్పొరేటర్లు ఉండగా, ఈ పాలక మండలిలో 81 మంది ఉండటం విశేషం.
కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి రాజకీయ ప్రస్థానం తెలిసిందే. ఇక్కడ డిప్యూటీ మేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆది నుంచి కేసీఆర్ వెన్నంటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమ నాయకుడు మోతె శోభన్‌రెడ్డి సతీమణికి డిప్యూటీ మేయర్ పదవి వరించింది. ఉద్యమ నేపఽధ్యానికి తోడు రాజకీయ సమీకరణాలు కూడా కలిసి రావడంతో ఉండడమే శోభన్‌రెడ్డి కుటుంబానికే డిప్యూటీ మేయర్ దక్కేలా చేసింది. టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా పేరున్న నాయకుడు తార్నాకకు చెందిన మోతె శోభన్‌రెడ్డి కావడం, ఆయన సతీమణి శ్రీలతారెడ్డి తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందడం బాగా కలిసివచ్చింది.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచీ మోతే శ్రీలత రెడ్డి భర్త మోతే శోభన్ రెడ్డి తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2002లో తార్నాక డివిజన్ నుండి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మోతే శ్రీలతశోభన్ రెడ్డి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ సకలజనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చ్, రైల్‌రోకో వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లగొండ జిలా, మోత్కూరు మండలం, తుక్కూరు గ్రామానికి చెందిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి కుటుంబానిది మొదటి నుంచి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం. ముఖ్యమంత్రి కెసిఆర్ టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించక ముందు టీడీపీలో పని చేశారు. 2001లో టీఆర్‌ఎస్ ఏర్పడ్డాక కెసిఆర్ అడుగుజాడల్లో నడిచారు.
2011లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తార్నాక డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలుపొందిన బండ కార్తీకా రెడ్డికి మేయర్ పీఠం వరించగా, ఇప్పుడు మళ్ళీ తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన మోతె శోభన్‌రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవి వరించడం విశేషంగా భావిస్తున్నారు.
మోతే శ్రీలత రెడ్డి డిప్యూటీ మేయర్ కావడంపై స్థానిక డివిజన్ వాసులు సైతం అనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోతె శ్రీలతారెడ్డి ఇదే తార్నాక డివిజన్ నుంచి గెలిచి మేయర్‌గా ప్రాతినిధ్యం వహించిన బండ కార్తీకరెడ్డి తోటి కోడలు బండ జయసుధపై 2,504 ఓట్లతో గెలుపొందడం మరో విశేషంగా చెప్పుకుంటున్నారు డివిజన్ వాసులు. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కావడం మరో విశేషంగా భావిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడం వల్ల తార్నాక డివిజన్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.