iDreamPost
android-app
ios-app

ప‌ల్లా విక్ట‌రీ కెసిఆర్ గెలుపు

ప‌ల్లా విక్ట‌రీ కెసిఆర్ గెలుపు

తెలంగాణ‌లో హోరాహోరిగా సాగిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల లెక్క‌తేలిపోయింది. నాలుగు రోజులుగా కొన‌సాగిన ఉత్కంఠ‌కు నిన్న తెర‌ప‌డింది. రెండో చోట్లా టీఆర్ఎస్ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వాణీదేవి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు. సిటింగ్ స్థానం కావ‌డంతో న‌ల్ల‌గొండ ఫ‌లితాలను అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నించారు.

ఆది నుంచీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డే ఆధిక్యంలో కొన‌సాగిన‌ప్ప‌టికీ అనూహ్యంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న గ‌ట్టి పోటీ ఇచ్చారు. చివ‌ర‌కు 1, 61,811 ఓట్ల‌తో ప‌ల్లా విజ‌యం సాధించారు. 1, 49, 005 ఓట్ల‌తో మ‌ల్ల‌న్న రెండో స్థానంలో నిలిచారు. సిట్టింగ్ స్థాన‌మైన న‌ల్గొండ

నియోజ‌క‌వ‌ర్గం కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను ఓ సారి ప‌రిశీలిస్తే…

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నిక‌లు ఈ నెల 14న జ‌రిగాయి. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 5,05,565 ఓట్లు ఉన్నాయి. 3,86,320 ఓట్లు పోల‌య్యాయి. 76.41శాతం పోలింగ్‌ నమోదైంది. నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని పౌరసరఫరాల గోదాములో ఈ నెల 17 బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు కౌంటింగ్‌ ప్రారంభమైంది. జంబో బ్యాలెట్ కావ‌డంతో తొలి రోజు రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు 25 చొప్పున‌ బండిల్స్‌ కట్టడానికే సమయం సరిపోయింది. నల్లగొండలో తొలిరౌండ్‌ ముగిసేట‌ప్ప‌టికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 16,130 ఓట్లు పోలవగా.. తీన్మార్ మల్లన్నకు – 12,046 ఓట్లు, కోదండరాం – 9080, బీజేపీ – 6,615, కాంగ్రెస్ – 4,354, చెల్లని ఓట్లు – 2,789 పోలయ్యాయి. మొదటి రౌడ్‌లో 56,000 ఓట్లను లెక్కించారు. చివ‌రి వ‌ర‌కూ ఒక‌టి, రెండు, మూడు స్థానాలు అలాగే కొన‌సాగాయి.

Also Read:పీవీ కుమార్తెదే గెలుపు

కౌంటింగ్ ప్ర‌క్రియకు నాలుగు రోజులు

కౌంటింగ్‌ కోసం ఒక్కో హాలులో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు 1000 చొప్పున 56వేల ఓట్లను లెక్కించారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌ చేశాక, ఒక్కోటేబుల్‌కు 1000 ఓట్లు (40) బండిళ్లు ఇచ్చి లెక్కించారు. అంటే ఒక రౌండ్‌లో 56వేల ఓట్లను లెక్కించగా, మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని తొల‌త అధికారులు భావించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల ఫలితం 18 న ఉదయం 8 గంటల లోగా వ‌స్తుంద‌ని ఊహించారు. తొలి ప్ర‌ధాన్యం తెలియ‌డానికే మూడు రోజులు ప‌ట్టింది. బండిల్స్ ఎక్కువ‌గా ఉండ‌డం, ఓట్లు పోటాపోటీగా ప‌డ‌డంతో లెక్కింపు ఆల‌స్య‌మైంది. తొలిరోజు సాయంత్రం 7 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జ‌రిగింది. తొలిరోజు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తొలి రౌండ్ మాత్ర‌మే పూర్త‌యింది. ప‌ల్లా ముందంజ‌లో ఉన్నారు. 56 వేల ఓట్లలో 8,000 ఓట్లు చెల్ల‌న‌విగా అధికారులు గుర్తించారు.

18వ తేదీ ఉద‌యం 7.30 గంట‌ల‌కు రెండో ఫ‌లితాలు వ‌చ్చాయి. ఫస్ట్‌ రౌండ్‌లో సత్తా చాటిన పల్లా.. రెండో రౌండ్‌లోనూ అదే రిపీట్ చేస్తున్నారు. సెకండ్ రౌండ్‌లో మొత్తం 56వేల 3 ఓట్లలో .. పల్లాకు 15 వేల 857 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 12 వేల 70 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. థర్డ్‌ ప్లేస్‌లో కోదండరామ్‌కు 9,448 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లతో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్క‌డి వ‌ర‌కు పల్లా 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 10.43 గంట‌ల‌కు మూడో రౌండ్ ముగిసింది. 17,393 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు. 13,122 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇక 11,907 ఓట్లతో ప్రొఫెసర్ కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు.

మొత్తం మూడు రౌండ్లు కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12,142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సాయంత్రం 7:13కు వ‌చ్చిన 4వ రౌండ్ ఫ‌లితాల‌‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,897 ఓట్లు పోలవ్వగా సమీప అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12,146, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 10,048 ఓట్లు వచ్చాయి. ఇక, మిగతా అభ్యర్థులు ప్రేమేందర్‌రెడ్డి(బీజేపీ)కి 5,099, రాములు నాయక్‌(కాంగ్రెస్‌)కు 4,003 ఓట్లు పోలయ్యాయి. చెల్ల‌ని ఓట్లు 3,223 గా ఉన్నాయి. 9:13 గంట‌ల‌కు నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఐదో రౌండ్‌ పూర్తయింది. ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 18,549 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లాకు పోలైన మొత్తం ఓట్లు 79,113. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 60,564 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 49,200 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533.

Also Read:గంటా కేటీఆర్ ను ఎందుకు కలిశాడు ?

19వ తేదీ 2:05 గంట‌ల‌కు ఆరో రౌండ్ ముగిసింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 22,843 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లాకు పోలైన మొత్తం 95,317 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఆరో రౌండ్‌లో పల్లా రాశేశ్వర్‌ రెడ్డికి 16,204 ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 72,474 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 59,705 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533. ఆరో రౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 11,910 ఓట్లు రాగా… కొదండరామ్‌కు 10,505 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 5,237 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,994 ఓట్లు దక్కాయి.

మొద‌ట ప్రాధాన్య‌త‌తో తేల‌ని లెక్క‌

ఎన్నిక‌లు హోరాహోరీగా కొన‌సాగ‌డంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల తో స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఎవ‌రికీ రాలేదు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత గెలిచేందుకు 1,83,167 ఓట్లు రావాల్సి ఉండ‌గా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌)కి 1,10,840 (30.25 శాతం) ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు (స్వతంత్ర) -83,290 (22.73 శాతం), కోదండరాం (టీజేఎస్‌)- 70,072 (19.12 శాతం), గుజ్జుల ,ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ)- 39,107 (10.67శాతం), రాములు నాయక్‌(కాంగ్రెస్‌)- 27,588 (7.53 శాతం) ఓట్ల‌ను పొందారు. దీంతో అధికారులు రెండో ప్రా‌ధాన్య‌త ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

కీల‌కం మారిన బీజేపీ అభ్య‌ర్థి ఓట్లు
19వ తేదీ సాయంత్రం 7.12 గంట‌ల వ‌ర‌కు నల్లగొండలో.. 52 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అయ్యారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొన‌సాగించారు. అయిన‌ప్ప‌టికీ లెక్క తేల‌లేదు. 20వ తేదీ మ‌ధ్యాహ్నం 2 : 9 గంట‌ల‌కు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభ‌మైంది. బీజేపీ అభ్యర్థి బదలాయింపు ఓట్ల పై మల్లన్న, కోదండరామ్ ఆశలు పెట్టుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. అంత‌కు ముందే 68 వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమిట్ అయ్యారు. ఆయన ఓట్లను ఇతర అభ్యర్థులకు జమ చేశారు. పల్లా రాజేశ్వర్‌కు 5,253, తీన్మార్ మల్లన్నకు -7,349, కోదండరాం- 10,297 ఓట్లు వచ్చాయి. లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ 39,107 ఓట్లు బదలాయింపు కీలకంగా మారింది.

Also Read:తిరుపతికి కూడా సోమిరెడ్డే నా?మంచి గెలుపు ట్రాక్ రికార్డ్ ఉన్న నేతలే దొరకలేదా?

కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన కోదండరాం

ఎలిమినేషన్‌‌కు దూరంగా ఉండి బరిలో ఉండాలంటే మల్లన్న‌ను దాటి 9,801 ఓట్లను కోదండరామ్ సాధించాల్సి ఉంటుంది. బీజేపీ ‌అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి‌కి వచ్చిన 39,107 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు కోదండరామ్‌కు ‌కీలకంగా మారాయి. ప్రేమేందర్ రెడ్డి బదలాయింపు ఓట్లు పడినా కోదండరాం రెండో స్థానానికి చేరుకోలేదు. దీంతో కోదండరాం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లన్న ఉన్నారు. దీంతో కౌంటింగ్ సెంటర్ నుంచి కోదండరాం వెళ్లిపోయారు. అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో ఎలిమినేష‌న్ ఉంటుంది.

పల్లాకు కంగ్రాట్స్ చెప్పిన మల్లన్న..

కోదంరాం ఎలిమినేష‌న్ త‌ర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి.. మల్లన్న మధ్య హోరాహోరా పోటీ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి ముందు వరుసలో దూసుకుపోయారు. మల్లన్న కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండ‌గానే మ‌ల్ల‌న్న వెళ్లిపో్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపును అధికారులు మరికాసేపట్లో ప్రకటించనున్నారు అన‌గా, కౌంటింగ్ కేంద్రంలో మల్లన్న పల్లాకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాలుగు రోజుల అనంత‌రం శ‌నివారం రాత్రి ఫ‌లితం తేలింది. ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని విజేత‌గా అధికారులు ప్ర‌క‌టించారు. 12,806 ఓట్ల మెజార్టీతో ప‌ల్లా గెలుపొందారు.