iDreamPost
iDreamPost
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు. తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దసరా వేళ కొత్త జాతీయ పార్టీకి నామకరణం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులు ఊహించినట్లుగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానం ప్రకారం తెరాస ఇకపై భారత రాష్ట్రసమితిగా మారనుంది. పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు.
అనంతరం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు. టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం మరో మెట్టుఎక్కినట్లయ్యింది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
తెరాసను జాతీయపార్టీగా , భారత్ రాష్ట్రసమితిగా మార్చగానే తెలంగాణ వ్యాప్తంగా గులాబీ సంబురం మొదలైంది. జిల్లా పార్టీకార్యాలయాల్లో స్థానిక నేతలు బాణాసంచా కాల్చారు. నినాదాలు చేశారు. తెలంగాణ మోడల్ లో దేశంలో మంచి మార్పుకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టుబోతోందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.