iDreamPost
iDreamPost
టీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. నిజామాబాద్ కు చెందిన సీనియర్ నేత ఆ పార్టీని వీడనున్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి ఆ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. రేవంత్ తో భేటీ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. సంజయ్ తోపాటు బీజేపీ లీడర్లు ఎర్ర శేఖర్, గండ్ర సత్యనారాయణ రావు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెప్పారు.
ఘర్ వాపసీ
టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కొడుకే ధర్మపురి సంజయ్. 2015లో తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు సంజయ్. అయితే చాలా కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారాయన. ఈ నేపథ్యంలో రేవంత్ తో భేటీ అయ్యారు. మంచి రోజు చూసుకొని ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరతానన్నారు. ‘‘నా తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా. కానీ అది కండువా కాదు. గొడ్డలి అని నాకు తెలుసు. కాంగ్రెస్తో పోల్చి చూస్తే టీఆర్ఎస్ అసలు రాజకీయ పార్టీయే కాదు. జిల్లా ప్రెసిడెంట్కు గుర్తింపు లేదు’’ అని చెప్పారు. తన తమ్ముడు (ఎంపీ అర్వింద్) ఏ పార్టీలో ఉంటే తనకేంటని ఆయన ప్రశ్నించారు.
ఒక్క ఫ్యామిలీలో మూడు పార్టీలు
డి.శ్రీనివాస్.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పని చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ టీఆర్ఎస్ లో తనకు మర్యాద లేదని, కేసీఆర్ అవమానించారని గతంలో డీఎస్ ఆరోపణలు చేశారు. కానీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. టీఆర్ఎస్ లో ఉన్నారంటే ఉన్నారంతే. డీఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్.. తండ్రితో పాటే గతంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇక డి.శ్రీనివాస్ చిన్న కొడుకు ధర్మపురి అర్వింద్.. బీజేపీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. నిజామాబాద్ నుంచి పోటీ చేసి, కేసీఆర్ కూతురు కవితపై గెలిచి సంచలనం సృష్టించారు. తండ్రి టీఆర్ఎస్ లోనే ఉన్నా.. ఈయన మాత్రం కారు పార్టీపై ఢీ అంటే ఢీ అంటుంటారు. తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరిగా ఉన్నారు.
Also Read : కర్ణాటక సీఎం పదవికి ‘సదా’ సిద్ధం!