iDreamPost
android-app
ios-app

తెరాస ఎమ్మెల్యే మైనంప‌ల్లి అరెస్టు త‌ప్ప‌దా?

తెరాస ఎమ్మెల్యే  మైనంప‌ల్లి అరెస్టు త‌ప్ప‌దా?

మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అడపాదడపా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అవి తీవ్రస్థాయికి చేరాయి. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు వచ్చారు. అప్పటికే అక్కడ స్థానిక బీజేపీ కార్పొరేటర్‌ శ్రావణ్‌, ఇతర బీజేపీ నాయకులు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యత చాటాల్సిన సమయంలో రెండు పార్టీల నేతలు చితక్కొట్టుకున్నారు. అసభ్యపదజాలంతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ టెన్షన్‌ వాతావరణం సృష్టించారు.

అది అంత‌టితో ఆగ‌లేదు. ఆ మ‌ర్నాడు మ‌రింత రాజుకుంది. మ‌ల్కాజిగిరిలో బంద్ కు దారి తీసింది. ఆ సంద‌ర్భంగా స్థానిక ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు వ్య‌వ‌హ‌రించిన తీరు, చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ వ్యవహారం చినికి, చినికి గాలివానగా మారుతోంది. ఆ సమయంలో దళితులను దూషించడంతో పాటు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్నిఎమ్మెల్యే కాళ్లతో తన్ని అవమానించారన్న విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా పరిగణించింది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుతో పాటు కేసులో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఎస్సీ కమిషన్ ఆదేశించింది. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్న ఎస్సీ కమిషన్ హెచ్చరించింది.

పంద్రాగ‌స్టు రోజున‌, ఆ మ‌ర్నాడు మ‌ల్కాజిగిరిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై ప‌రిశీల‌న‌కు ఢిల్లీ నుంచి జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ అల్డర్ హైదరాబాద్ వ‌చ్చారు. బాధితులను నేరుగా కలిసి విచారణ జరిపారు. అనంతరం ఎస్సీ కమిషన్ ఎమ్మెల్యేకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదు కాగా రాజ్యంగబద్దమైన కమీషన్ నేరుగా ఆదేశాలు ఇవ్వడంతో.. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ రోజు జ‌రిగిన దాడిలో కార్పోరేటర్ శ్రావణ్‌ కాలికి గాయం కావడంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కార్పోరేటర్ శ్రావణ్‌ను పరామర్శించిన అనంతరం మైనంపల్లిపై విమర్శలు గుప్పించారు. అనంతరం మైనంపల్లి కూడా ప్రెస్‌మీట్ పెట్టి బండి సంజయ్‌పై మాటల తూటాలు పేల్చారు. దీంతో వ్యవహారం హీటెక్కింది.