iDreamPost
android-app
ios-app

కూలి చేసి సంపాదించిన లక్షల డబ్బుకు లెక్క చెప్పండి..

కూలి చేసి సంపాదించిన లక్షల డబ్బుకు లెక్క చెప్పండి..

“ఈ నెల 27న వరంగల్ లా పార్టీ భారీ బహిరంగ ఉంది గద.. సభ ఖర్చుల నిర్వహణకు 14నుంచి 20 వరకు గులాబీ కూలీ దినాలుగా నిర్ణయించినం.. పార్టీ శ్రేణులంతా ఏవైనా రెండురోజులు కూలీ పనిచేసి సంపాదించిన డబ్బుతో బహిరంగ సభకు రావాలి.. ‘కార్యకర్తలు, నేతలు బండిఖర్చు, తిండి ఖర్చులకోసం కూలీ చేయాల్సిందే.. ఇది మన పార్టీ మొదటినుంచి అనుసరిస్తున్న సంప్రదాయం.. నేనుకూడా పనిచేస్తా..” అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ళక్రితం పార్టీ శ్రేణులను ఆదేశించారు.. అధినాయకుని ఆదేశాలతో అందరూ కూలీ చేసి డబ్బు సంపాదించారు.

హన్మకొండలో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మోక్ష ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌ విల్లాస్ లో పనిచేసి చెరో రూ.లక్ష సంపాదించారు.. టి.పద్మారావు తుకారంగేట్‌లో చేపలు అమ్మి రూ.38.50 లక్షలు సంపాదించారు. గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి మల్లాపూర్‌లో ఇటుకలు మోసి రూ.లక్ష, వెంచర్‌లో మొక్కలకు నీళ్లుపోసి రూ. లక్ష సంపాదించారు. గాదరి కిశోర్‌ సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో రైస్‌ మిల్లుల్లో బస్తాలు మోసి రూ.75 వేలు, టీ స్టాల్‌లో టీ అమ్మి రూ.25 వేలు, ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూర్‌లోని రైస్‌ మిల్‌లో బస్తాలు మోయడంతోపాటు, గోల్డ్‌ షాప్‌, వైన్‌ షాపుల్లో పనిచేసి రూ.10 లక్షలు సంపాదించారు.

నాయిని నర్సింహారెడ్డి బావర్చి హోటల్‌లో పనిచేసి రూ50వేలు, పిస్తా హౌస్‌ లో పనిచేసి రూ.51వేలు, బట్టల షాపులో పనిచేసి 20.52 లక్షలు సంపాదించారు. కేటీఆర్‌ ఐస్‌క్రీమ్‌ అమ్మి రూ.7 లక్షలు, హరీశ్‌రావు రైస్‌మిల్లులో పనిచేసి రూ.6.27 లక్షలు సంపాదించారు. ఈటల రాజేందర్‌ రైస్‌ మిల్లులో మూటలు మోసి రూ.11 లక్షలకు పైగా సంపాదించారు. మహేందర్‌రెడ్డి తాండూరు నర్సరీలో పనిచేసి రూ.10లక్షలు సంపాదించారు.సి.లక్ష్మారెడ్డి యశోద ఆస్పత్రిలో బీపీ చెక్‌ చేసి రూ.5 లక్షలు, ఇతర చోట్లలో పనిచేసి మరో రూ.16 లక్షలు సంపాదించారు. తలసాని శ్రీనివాస్‌ స్వీట్‌షాపులో మిఠాయిలు అమ్మి రూ.18.50 లక్షలు సంపాదించారు.

అయితే గులాబీ కూలీ కార్యక్రమం పేరుతో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని, అప్పట్లోనే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని పార్టీకోసం సేకరించారని, ఇది అవినీతి నిరోధక చట్టం -1988, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951ని ఉల్లంఘించడమేనని రేవంత్ ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. ఈవిషయంలో న్యాయస్థానాన్ని కూడా రేవంత్ ఆశ్రయించారు. ఈ క్రమంలో గులాబీ కూలీ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయ లెక్కలు చెప్పాలంటూ ఆదాయపు పన్నుశాఖ ఇప్పుడు సదరు నేతలందరికీ నోటీసులిచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల, మహమూద్‌ అలీతోపాటుగా చాలామంది పేర్లు ఉన్నట్లు సమాచారం. హఠాత్తుగా ఐటీశాఖ నుంచి నోటీసులు రావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు కంగారు పడ్డారట.

అధిష్ఠానం పిలుపు మేరకు ‘ఉత్తుత్తి’ కూలి పనులుచేసి లక్షల రూపాయలు సంపాదించారు.. అదే ఇప్పుడు వారికి చిక్కు తెచ్చిపెట్టింది. చేసిన పనులకు, సంపాదించిన డబ్బుకు పొంతన లేకపోవటం.. గోడలకు నీళ్లు పట్టి, ఐస్‌క్రీమ్‌ అమ్మి, బిర్యానీ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. చేసినపనితో నిమిత్తం లేకుండా హోదా, పదవి చూసి వ్యాపార, వాణిజ్యవేత్తలు వారికి పెద్ద మొత్తాలను ముట్టజెప్పడంతో ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ప్రైవేటు పార్టీకి నిధులు సేకరించడం వివాదానికి మూలమైంది. దీనంతటికీ రేవంత్ ఫిర్యాదులే కారణమట..

అయితే నోటీసులందుకున్నవారంతా వాటికి సమాధానం ఇచ్చే పనిలో పడ్డారు. ఈ నోటీసులకు పార్టీపరంగా జవాబివ్వాలా.? లేక వ్యక్తిగతంగా ఇవ్వాలా.? అనే సమాలోచనలు జరుపుతున్నరు. నోటీసులు వేర్వేరుగా రావడంతో వ్యక్తిగతంగానే బదులివ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపై ఇటువంటి కార్యక్రమాలు చేసే రాజకీయ పార్టీలు ముందుగానే పలు జాగ్రత్తలు వహిస్తే భవిషత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.