iDreamPost
android-app
ios-app

ఈటల మాటల తూటాలకు టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి

  • Published Jul 26, 2021 | 11:37 AM Updated Updated Jul 26, 2021 | 11:37 AM
ఈటల మాటల తూటాలకు టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి

‘‘నిజంగా నేను తప్పు చేసి ఉంటే.. విచారణ జరపండి. తప్పు చూపించండి’’.. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఈటల రాజేందర్ చెబుతున్న మాట ఇది. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలోకి చేరిన ఆయన.. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా మరోసారి ‘నేను తప్పు చేసి ఉంటే సీఎం కేసీఆర్ ఎందుకు నిరూపించలేకపోయారు?’ అని ఈటల మరోసారి ప్రశ్నించారు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొదట్లో తనపై భూకబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు.. కొందరు మంత్రులు ఆరోపణలు చేసినప్పుడు ఈటల ఇదే విషయాన్ని నిలదీశారు. కానీ ఎవ్వరూ సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. ‘‘ఉన్నది నీ అధికారులే కదా.. విచారణ చేయించు. ఏం తప్పు ఉందో చూపించు’’ అని ఆయన ఎదురు ప్రశ్నిస్తుంటే ఏం చేయలేని పరిస్థితి.

ముందే తేల్చేసిన కేటీఆర్..

ఈటల రాజేందర్ కు చెందిన సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని, అసైన్ మెంట్ భూములను కొన్నారని ఆరోపణలు వచ్చాయి. కొందరు రైతులు ఫిర్యాదు చేయగానే.. కలెక్టర్లు, అధికారులు రంగంలోకి దిగడం.. ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేయడం.. ఆ వెంటనే మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయంలో హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఒక్కరోజులో విచారణ ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఎవరో ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకోలేదని, వ్యక్తిగతంగా ఈటలను పార్టీలో కొనసాగేలా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ లో ఉంటూ ఈటల ప్రతిపక్ష పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. ఈ లెక్కన ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడానికి కారణం భూకబ్జా ఆరోపణలు కాదని, అవి కేవలం సాకు మాత్రమేనని కేటీఆర్ పరోక్షంగా అంగీకరించారు. దీంతో అప్పటి నుంచి ఈటల స్వరం మరింత పెరిగింది.

వ్యూహాత్మక మౌనం?

ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు, ఆయన్ను మంత్రివర్గం నుంచి తీసేయడం వల్ల టీఆర్ఎస్ పై కాస్త వ్యతిరేకత పెరిగింది. ఇదే సమయంలో ఈటలపై సానుభూతి కూడా పెరిగింది. గతంలో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కూడా ఇలానే పదవుల నుంచి తొలగిస్తారా? అన్న ప్రశ్నలు ప్రతిపక్షాలు, మీడియా నుంచి వచ్చాయి. ఈటలను టార్గెట్ చేస్తే నష్టమేనని భావించిన సీఎం కేసీఆర్ వ్యూహం మార్చారు.

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి.. అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. పలు జిల్లాల్లో పర్యటనలు చేశారు. అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడిగేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో దళిత బంధు పథాకన్ని తెరపైకి తెచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నే ఎంచుకున్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాలకు ప్రారంభించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. ఇలా ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఈటలపై వచ్చిన ఆరోపణల విషయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

Also Read : ఈటల రాజేందర్ బలం కేసీఆర్ కు తెలుసా..?