iDreamPost
android-app
ios-app

మినీ మునిసిపోల్స్‌ : అన్ని చోట్లా గులాబీ గుబాళింపు

మినీ మునిసిపోల్స్‌ : అన్ని చోట్లా గులాబీ గుబాళింపు

ఊహించినట్లుగానే మినీ మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలలో కూడా గులాబీ పార్టీ గెలుపొందింది. ఎన్నికలు జరిగిన 2 కార్పొరేషన్లు, 5 మునిసిపాలిటీలను కూడా కైవసం చేసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక, ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయాన్ని టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. రాష్ట్రంలో వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌, సిద్దిపేట, అచ్చంపేట మునిసిపాలిటీలకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌, మెట్‌పల్లి, బోధన్‌, పరకాల, గజ్వేల్‌ మునిసిపాలిటీల్లోని ఒక్కో వార్డుకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి ఓట్ల లెక్కింపునుఎన్నికల కమిషన్‌ సోమవారం చేపట్టింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

వరంగల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకుగాను 51 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ ప్రధాన పోటీదారుగా నిలిచిన బీజేపీ, పది డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను దక్కించుకోగలిగింది. ఇతరులు 3 డివిజన్లలో గెలిచారు. ఖమ్మం కార్పొరేషన్లో సీపీఐతో కలిసి బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌.. ఇక్కడా ఏకపక్ష విజయాన్నే నమోదు చేసింది. టీఆర్‌ఎస్‌తో పొత్తుతో సీపీఐ 2 డివిజన్లను దక్కించుకుంది. ఇక్కడ టీడీపీ, సీపీఎంలతో కాంగ్రెస్‌ పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకుంది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలిచి 10 డివిజన్లను దక్కించుకుంది. సీపీఎం రెండు డివిజన్లలో గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్‌ కూటమికి 12 డివిజన్లు దక్కాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ ఇక్కడ బోణీ కొట్టింది. ఒక డివిజన్లో గెలిచింది. స్వతంత్రులు రెండు చోట్ల విజయం సాధించారు.

మిగిలిన 43 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగరేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే పట్టం కట్టిన వరంగల్‌, ఖమ్మం ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచినట్లయింది. మునిసిపాలిటీల విషయానికి వస్తే.. మంత్రి హరీష్‌రావు ఇలాకా అయిన సిద్దిపేట మునిసిపాలిటీలో 43 వార్డులకుగాను 36 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఒక్క వార్డునూ దక్కించుకోలేదు. బీజేపీకి మాత్రం ఒక వార్డు దక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలను పక్కకు నెట్టి ఇతరులు 6 వార్డులను కైవసం చేసుకున్నారు. అటు నకిరేకల్‌ మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను టీఆర్‌ఎస్‌కు 11 దక్కగా.. కాంగ్రెస్‌కు రెండు వార్డులే దక్కాయి. ఇక్కడా ఇతరులు ఏడు వార్డులను కైవసం చేసుకున్నారు.

కొత్తూరు మునిసిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. మొత్తం 12 వార్డులకుగాను ఏడు వార్డులను అధికార టీఆర్‌ఎస్‌ దక్కించుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ ఐదు వార్డులను దక్కించుకుంది. జడ్చర్ల మునిసిపాలిటీలో 27 వార్డులకుగాను 23 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీలు చెరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. అచ్చంపేట మునిసిపాలిటీలో 20 వార్డులకుగాను 13 టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా.. కాంగ్రెస్‌ ఆరు, బీజేపీ ఒక వార్డు చొప్పున దక్కించుకున్నాయి. మరోవైపు.. వివిధ మునిసిపాలిటీల్లోని ఐదు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మూడు వార్డుల్లోను, కాంగ్రెస్‌, బీజేపీలు చెరో వార్డులోనూ గెలిచాయి. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి పరిధిలోని లింగోజీ గూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవగా.. పరకాల మునిసిపాలిటీలోని ఓ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. మిగిలిన మూడు వార్డులూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.